31/03/2012

ఓటమిలో గెలుపు


నా మనసుని మెత్తగా కోసే శక్తి....
ఏ చంద్రహాసానికీ లేదనుకొనే నన్ను
నీ మందహాసంతో  పరిహసించావు....

నా  ప్రేమ ఒక నిరంతర  ప్రవాహమైతే,
నీ వలపుల  సంద్రంలో  దాన్నెప్పుడో  కలిపేసుకున్నావు....
నా మాటల తీయదనం కంటే,
నీ పలుకుల తేనెలే మధురం అని తెలిసేలా చేసావు....

నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాననే భ్రమలో ఉన్న నన్ను ...
నీ ప్రేమతో జయించి....వాస్తవంలోనికి తీసుకొచ్చావు.

అన్నింటా గెలుపు నీదేనా?
నన్ను ఒక్కసారైనా గెలవనివ్వవా?
అని అడిగితే నాకు గెలిచే అవకాశం మాత్రం ఇవ్వకుసుమా!

నీ గెలుపు నాకు ఇచ్చే హాయి కంటే
నా గెలుపు యిచ్చే సుఖం గొప్పది కాదని,
ముందే ఒప్పేసుకుంటున్నాను.
నా ఓటమిలోనే నా  ప్రేమగెలుపుని
ఆనందంగా  స్వీకరిస్తున్నాను......


























29/03/2012

తొలి ప్రేమ


నీ తొలి చూపుల బాణాలు  
ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి......

నీవు మాట్లాడిన మొదటి మాట
నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది...

నాపై  విసిరిన నవ్వుపువ్వు 
తగిలి కందిన బుగ్గ ఇంకా ఎర్రగానే ఉంది....

నీ తొలిప్రేమలేఖ లోని అక్షర నక్షత్రాల మెరుపులు....
నేటికీ నాకంటికి అలంకారాలుగానే ఉన్నాయి.

నీవు తొలిసారి వ్యక్తం చేసిన ప్రేమ....
ఎప్పటికీ మరువలేని మధుర స్వప్నం లాగే ఉంది.

మనం తొలిసారి తిరిగిన తోట గులాబీల పరిమళం...
ఇప్పటికీ నన్ను పలకరిస్తూనే ఉంది.

నన్ను తాకిన నీ తొలిస్పర్శ....
నేటికీ ఒక అగ్నికీలలా నన్ను దహిస్తూనే,
శ్రీచందనపు పూతలా హాయినిస్తోంది.

నీ చూపులు, నీ నవ్వులు,
నీ మాటలు, నీ లేఖలు,
నీ వలపులు, నీ తలపులు....
అన్నీ నాలోనే ఉంటూ అనుక్షణం 
నిన్నే గుర్తుకి తెస్తుంటే,
ఈ విరహం కూడా సుఖంగానే ఉంది....
నీ ప్రేమలా.
                                                                              @ శ్రీ 





























26/03/2012

రాధామాధవం


నాది కృష్ణ వర్ణం...నీది శ్వేత వర్ణం..
మనిద్దరికీ జత కుదురుతుందా???
నేను రాత్రయితే...నీవు పగలు...
మనిద్దరం కలిసుండేదెలా???



కన్నయ్యా!
ఎన్ని సందేహలో నీకు....
ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపించేవన్నీ
వాస్తవంగా అలా ఉండవు...

వేరుగా కనిపించే...
రేయింబవళ్ళు ఒకదానికొకటి పూరకాలు.
చంద్రుని  వెన్నెల చిత్రాలు చూడాలన్నా,
తారాదీపాల వెలుగులు కావాలన్నా...
నీలాకాశం(నల్లని ఆకాశం)  ఉండాలి  కదా!
విద్యుల్లతల  అందం పెంచేవి
ఆ నల్లని మబ్బులే కదా!




నీవు లేక నేను,
నేను లేక నీవు లేనే లేమని
తెలిసికూడా...  అన్నీ నా చేత చెప్పించాలనే
నీ అంతర్భావాన్ని నేను,
నీ అంతర్భాగాన్నే నేను...













25/03/2012

నా ప్రేమ



ఈ లోకంలో ఇంతమంది ఉండగా
నాతోనే ఎందుకు జత కట్టాలనుకున్నావ్?
నన్నే ఎందుకు తోడుండమన్నావ్?
నాతోనే ఎందుకు జీవితం పంచుకోవలనుకున్నావ్?
నా ప్రేమకోసం ఎందుకు ఆరాటపడుతున్నావ్?
అంటూ ఎప్పుడూ ప్రశ్నిస్తావ్   నన్ను,


పరిమళం పూలతోనే ఎందుకు జత కడుతోంది?
వెన్నెల చంద్రునికే ఎందుకు తోడుంది?
వెలుతురు దీపాన్ని ఎందుకు వీడదు?
నది సముద్రం వైపే ఎందుకు పరుగులు తీస్తుంది?
వీటన్నిటికీ సమాధానం ఉందా?


నీ ప్రేమ కోసం చూసే నా ప్రేమని అడుగు..
నీ ప్రతి ప్రశ్నకి సమాధానం  దొరుకుతుంది.
నీలో ఉన్న నన్ను ప్రశ్నించు,
నాలో ఉన్న నిన్ను ప్రశ్నించు....
నిన్ను కోరే నా మనసు  చెప్పే జవాబు తప్పక దొరుకుతుంది.....






23/03/2012

విరహ తిమిరం



నీకోసం వేయి కన్నులతో....
వేచి చూస్తున్నాను ప్రియా!
లోకానికి చల్లదనాన్నిచ్చే నెలరాజు
మంటలు రేపుతున్నాడు నాలో....

పున్నమి వెన్నెల,  తిమిరాన్ని మింగుతూ
లోకాన్ని ప్రకాశవంతం చేస్తుంటే......
విరహ తిమిరం నన్ను మింగుదామని 
అనుక్షణం కోరలు చాచి నా వెంట పడుతోంది..


నీవు లేకుంటే ఈ విరహతిమిరానికి కూడా నేనంటే అలుసే...

చంద్రుని వెన్నెలంటే భయం లేదట,
వెన్నెల లాంటి నీ చూపంటే భయం అంటోంది,
వెన్నెల కురిపించే నీ మాటలంటే భయం అంటోంది,
వెన్నెల విరిసినట్లుండే నీ నవ్వంటే భయం అంటోంది,
వేయి వెన్నెలల వెన్నల బొమ్మలాంటి నువ్వంటేనే భయం అంటోంది.

నా జీవన  శరత్చంద్రికవై పరుగు పరుగున రావాలి....
నీ రాకతో నన్ను ముసిరిన చీకట్లు పారిపోవాలి...
ఈ విరహ తిమిరం నన్నొదిలి పోవాలి,
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి....
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి.
                                                                    @శ్రీ











22/03/2012

'నందన' ఉగాది


సిరిమల్లెల ఘుమఘుమలు
నలుదిశల వ్యాపిస్తునాయి.
వసంత కోకిల కుహు,కుహులతో
ప్రకృతి పరవశిస్తోంది.


ప్రతి చెట్టు... పెళ్ళికి ముస్తాబైన 
నవ వధువులా కనిపిస్తోంది.
ప్రకృతి అంతా సౌందర్యమయంగా
ఆనంద భరితంగా కనిపిస్తోంది...


పిల్ల తెమ్మెర లోని చల్లదనంలా...
కోకిల పాటల లోని మాధుర్యంలా...
పూల మకరందపు మత్తులా...
కుసుమ పరాగాల పరిమళంలా...
'నందన' వనం లోని పారిజాతాల వర్షంలా...


"నందన" నామ సంవత్సరం వచ్చేసింది ..
అందరికి ఆనందాన్ని పంచేందుకు.....
అందిరికి నూతనోత్సాహాన్ని ఇచ్చేందుకు...
అందుకే ఈ ఉగాది...నందన ఉగాది,
'ఆనంద' ఉగాది. 



















21/03/2012

గుర్తుకొస్తున్నాయి



చిన్నప్పటి  ఆటపాటలు, గిల్లికజ్జాలు...
దసరా పండుగల పప్పు బెల్లాలు...
జెండా పండుగులప్పటి  తరగతి సున్నాలు, 
కట్టిన రంగు కాగితాల ఝాలర్లు....



పరీక్షల్లో పక్కోడి పేపర్లో  కొట్టిన కాపీలు...
అప్పుడప్పుడు పెట్టిన  స్లిప్పులు,
పట్టుబడినప్పుడు తిన్న పేకబెత్తం దెబ్బలు....
మార్కులు వెయ్యని టీచర్లని తిట్టుకున్న తిట్లు...

ఖాళీ దొరికితే చేసిన అల్లర్లు...
టీచర్లకు పెట్టిన మారు పేర్లు...
లీవు కోసం తెచ్చుకున్న దొంగాజ్వరాలు
ప్రొగ్రెస్ రిపోర్టుల్లో పెట్టిన నకిలీ సంతకాలు...

వేసవిలో ఎక్కిన స్కూలు ప్రాంగణపు మామిళ్ళు...
వెన్నెల రాత్రుల్లో ఆడుకున్న కబాడీ ఆటలు...
ఆటల పోటీలకు తిరిగిన ఊళ్లు,
సాధించిన కప్పులు....

లీజరు టైములో  పాటలకి వేసిన స్టెప్పులు...
ఇంటర్వెల్లో కొనుక్కున్న పుల్ల ఐసులు....
అమ్మాయిల కంపాస్ బాక్సుల్లో నుంచి కాజేసిన బఠానీలు...
చవితి పండుగప్పుడు కొట్టుకున్న పల్లేరుకాయలు....

అబ్బాయిల నూనూగు  మీసాలు...
అమ్మాయిల రంగురంగుల వోణీల రెపరెపలు...
నోట్సుల్లో పెట్టి అందించుకున్న ప్రేమలేఖలు...

ఇంకా చెప్పలేని అల్లర్లు...
చెప్పుకోలేని అల్లర్లు....

అన్నీ ఒకదాని వెనుక ఇంకోటి ఇప్పుడు కూడా 
కంటికి కనిపిస్తున్నాయి....
ఎప్పటికీ మర్చిపోకుండా 
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి....



20/03/2012

'చెలి'కి మేలుకొలుపు



నిత్యం నీ ప్రేమ పలకరింపులతో
నా నుదిటిపై నీ వెచ్చని పెదవుల స్పర్శతో
నన్ను మేలుకొలుపుతావు నువ్వు.
నేడు నీకంటే ముందుగా నిద్ర లేచి,
నిన్ను నిద్ర లేపాలనుకున్నాను.

నిద్రిస్తున్న నిన్ను చూసేదాకా నాకు తెలియదుసుమా!
అలసి సొలసి నిద్రించిన అందం ఇంత అందంగా ఉంటుందని..
చెదిరిన కుంకుమ నుదిటికి కొత్త అందాన్ని తెస్తే...
పాపిట సిందూరం ముంగురులకి వింత సోయగాన్ని ఇచ్చింది.
సిగలో వాడిన మల్లెలు కొత్త కథలేవో చెప్తున్నాయి.

పగలంతా వంపు సొంపుల వయ్యారి నదిలా ప్రవహించి,
రాత్రి వేల ఉరుకుల పరుగుల జలపాతంగా మారి...
చివరికి సముద్రంలో కలిసిన నదిలా ఎంత ప్రశాంతంగా ఉన్నావ్?

'నిద్రిస్తున్న అందమైన ప్రియురాలి ఎర్రని పెదవులను ముద్దు పెట్టుకున్నాను..
ఎంత అందమైన దొంగతనం అది' అంటాడు గాలిబ్....
ఆ దొంగతనం రుచి నేడే తెలిసింది...
ఆ పెదవి మాధుర్యం ఇపుడే తెలిసింది...

ఆ దొంగతనమే నీ మేలుకొలుపుకి నాంది...
ఆ దొంగతనమే నీ మేని మేలుకొలుపుకి నాంది...





19/03/2012

మనసు పిలుపు

మనసు పిలుపు 

నిన్ను ప్రేమతో రమ్మని  పిలుస్తున్నాను  ప్రియా!
దిక్కులు పిక్కటిల్లేలా...
భువనం దద్దరిల్లేలా...
ప్రళయ కాల మేఘ గర్జనలా
నా పిలుపు దశ దిశలా వ్యాపిస్తోంది....
ప్రకృతిలోని ప్రతి కణం నా పిలుపు వింటోంది...
కొండలని తాకి లోయల్లో ప్రతిధ్వనిస్తోంది...
నదీనదాలలో కలిసి ప్రవహిస్తోంది...

కానీ చిత్రం చూడు....
నా చుట్టుపక్కల ఎవరూ స్పందించడం లేదు...
అంతా నన్ను మౌనంగా ఎందుకున్నావని  అంటున్నారు. 

నాకు తెలుసు
నా పిలుపు నిన్ను చేరిందని,
నీ మనసుని తాకి తిరిగి నా చెంతకు చేరిన..
నా పిలుపు చెప్పదుగా అబద్ధం.

మనసు పిలుపు మనసుని చేరుతుంది, 
మనసు పిలుపు మనసు మాత్రమే వినగలుగుతుంది.... 
బదులివ్వగలుగుతుంది.
మనసు పిలుపు మనసున్న మనసు మాత్రమే వినగలుగుతుంది...
బదులివ్వగలుగుతుంది.


























18/03/2012

శత శతకాల సచిన్


(100x100)

పిన్నవయసు లోనే బ్యాట్  పట్టావ్..
భీకరమైన బౌలర్లకు దీటుగా జవాబిచ్చావ్ ..
ఎన్నో బంతులను బౌండరీలకు తరలించావ్..
భారీ సిక్సర్లుగా మలిచావ్.

ప్రతీ బౌలర్ కీ  నీ బ్యాటింగ్ అంటే దుస్స్వప్నం,
ప్రత్యర్ధి జట్టుకి నువ్వంటే సింహస్వప్నం.
నువ్వు భారత జట్టుకి కొండంత అండ,
ప్రత్యర్ధి జట్లకి బెంగల కొండ.


ప్రతి జట్టు పైనా శతకం,
ప్రతి దేశంలోనూ ఎగరేసావు విజయ పతాకం.
టెస్టుల్లో, వన్డేల్లో అదే జోరు,
20 - 20 ఫార్మాట్ లోనూ అదే తీరు...

రికార్డులు నీ పాదాల్ని చుంబిస్తాయి,
అవార్డులు నిన్నే వరిస్తాయి.
సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం నీకే సాధ్యం,
అసాధ్యమైన లక్ష్యసాధనలు నీకే సాధ్యం.

ప్రపంచ క్రికెట్లో నువ్వొక బలమైన శక్తి,
అందుకే నువ్వంటే ప్రజలకి అంత భక్తి.
ఏ క్రికెటరైనా కలలో మాత్రమె ఊహించగలడు శతకాల శతం...
అది నువ్వు నిజం చేసావన్నది నిజంగా  నిజం...

ఇది ఒక అరుదైన ఫీట్...
అందుకో నీ అభిమానుల సాల్యూట్.
అందుకే....
అందుకో నీ అభిమానుల సాల్యూట్.

ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం 

ఉంది ఈనాటి పున్నమి వెన్నెల...
మోహనకరంగా,
సమ్మోహనకరంగా.....
మత్తుగా,
గమ్మత్తుగా....
పాల కడలిలా,
నా ప్రేమతాపాల కడలిలా....
నీ వలపుల జల్లులా 
నా సిగలో విరజాజుల జల్లులా....

ఈ వెన్నెల సముద్రంలో చేయాలి 
నీతో ప్రేమ ప్రయాణం...
మన ప్రేమ నౌకను చుక్కల దీపాలతో  అలంకరించు...
తెరచాపకు  ఇంద్ర ధనుస్సు  రంగులను అద్దు...

దారి చూపడానికి ఉండనే ఉంది  జాబిలి....
ఇక మొదలెడదాం...
మన ప్రేమ ప్రయాణం ఈ వెన్నెల సముద్రంలో...
ముందుకు సాగిపోదాం....
మన ప్రేమ పున్నమి వెన్నెల సముద్రంలో....

























17/03/2012

జవాబు లేని ప్రశ్న?


కాగితంపై  నాలుగక్షరాలు రాద్దామంటే
కలం ముందుకు పోదాయె...
ఎన్నో  కవితలు  చదివాక,
ఎన్నో పాటలు విన్నాక,
ఎన్నో భావాలు ఒక దాని వెనుక ఇంకోటి
మనసులోనికి వచ్చేవి.
ఏదో రాయాలని కూర్చుంటే 
ఒక్క  భావం స్పురణకు రాదాయె....

ఇంతలో ఒక్కసారిగా పెనుమార్పు.
అంతా ఆశ్చర్య పోయేలా....
నన్ను నేను నమ్మలేకపోయేలా...
నేను 'కవి'ని అయిపోయాను.

నిన్ను తొలిసారి చూసాక..
నా కవితాక్షరాలు ఊపిరి పోసుకున్నాయి.
నా మనోభావాలు ప్రాణం పోసుకున్నాయి.
నా ప్రేమ కవితలు నీలా అందమైన రూపు దిద్దుకుంటున్నాయి.
ఒక్కక్క భావం ఒక్కక్క ముత్యాలసరంగా మారుతోంది,
అక్షరాలు నక్షత్రమాలలుగా  మారుతున్నాయి.

ఈ మార్పు నీ వలనా?
నీ ప్రేమ వలనా?
నా ప్రేమ వలనా?
అన్నీ జవాబు లేని ప్రశ్నలే.....
అన్నీ జవాబు తెలియని ప్రశ్నలే....









16/03/2012

మనం





నా ప్రేమ ఒక హిమనదం లాంటిది.
దానికి నిరంతరం  ప్రవహించడం తప్ప,
ఆగడం తెలియదు.
నా ప్రేమ ఒక సాగరం లాంటిది
ఆ సాగరం లోతు నీకెప్పటికీ  తెలియదు.

నా ప్రేమ ఒక నిశ్శబ్ద సంగీతం లాంటిది.
మనసుతో మాత్రమే వినగలిగేది.
నీ మనసు మాత్రమె వినగలిగేది.
నా ప్రేమ మలయ పవనం లాంటిది.
నీ కంటికి కనపడనిది.
నీకు ఆహ్లాదాన్నిచ్చేది.

నా ప్రేమ  "నువ్వు-నేను"
లేక  "నేను-నువ్వు "కాదు
విడదీయలేని  శబ్దం 'మనం'.
విడదీయరాని శబ్దం 'మనం'

సదా జపం




నీ కిలకిలారావాలను మరువలేక
నా మనసెంత కలవర పడుతోందో తెలుసా నీకు?
నీ చివురాకు పెదవి మధువు మరువలేక
నా పెదవి పడే బాధ నీకెలా తెలుస్తుంది?

నీ మేని స్పర్శ  మరపునకు రాక
నా తనువు పడే తత్తరపాటు నీకెలా తెలుస్తుంది?
నీ మేని విరుపుల మెరుపులు మరపునకు రాక 
నా కనులనుభవించే బాధ నీకెలా తెలుస్తుంది?

నీకోసం,
నీ మాట కోసం,
నీ నవ్వు కోసం,
నీ ప్రేమ కోసం,
నీ స్పర్శ కోసం...
సదా జపం చేసే 
'సదాజపుడిని' అయిపోయాను నేను...
'నిత్యజపుడిని' అయిపోయాను నేను.












నీకోసం నేనేమివ్వగలను?


ఒంపుల  సొంపుల వయ్యారి నదిలా
ప్రవహించే నన్ను పలకరించి
పులకరించే నీకోసం వేచి చూసాను....
నీ జాడ  తెలియలేదు....



వేగాల జలపాతాన్నై,
ఉత్తుంగ తరంగాన్నై
ఉరికినప్పుడు
ఆ ఉరుకుల పరుగుల  నురుగులలో
తడిసి,మురిసి పరవశించేందుకు నీవు రాలేదు.


ఆనకట్టలో ఒదిగి ,
చేనుగట్టులో నిలిచి
పచ్చని పైరుగా మారిన నాకోసం వచ్చిన నీకు ...
నేనేమివ్వగలను.....
నీకోసం నేనేమి చేయగలను?

















12/03/2012

నేను బయటపడేదెలా?

నేను బయటపడేదెలా?


అలికిడైతే  చాలు...
నీ మోహన మురళీగానమేమోనని 
ఉలికిపడి నిద్రలోంచి లేచి చూడటం 
అలవాటుగా మారిపోయింది  నాకు.




గది కిటికీ నుంచి నా నుదుటిని 
తాకే ప్రభాత కిరణం...
నీ వెచ్చని కరస్పర్శేమోనని భ్రమించడం
అలవాటుగా మారిపోయింది  నాకు.


నిత్యం నీ మనో'సందేశమే'....
మేలుకొలుపుల 
శుభ ప్రభాతం అవుతోంది  నాకు.


ఇంటి నలుమూలలా నిన్నే చూస్తున్నాను...
రేయింబవళ్ళు  నిన్నే చూస్తున్నాను...
ప్రతిక్షణం నీ మాటలే  వినిపిస్తున్నాయి...


అంతెందుకు ప్రియతమా!
నన్ను నేను చూసుకొనే అద్దంలో కూడా 
నీ రూపమే కనిపిస్తుంటే యెలా?
నీ ఆలోచనల నుంచి నేను బయటపడేదెలా?
నీ వలపుల తలపుల 'వల' నుంచి నేను బయటపడేదెలా?













09/03/2012

జీవన మురళి




జీవం లేని వెదురు నా మనసు.
మన్మధ బాణం లాంటి   నీ చూపుతో.. 
నా మనసుకి చేసావు గాయం.

నెమ్మదిగా ఆ గాయం
అందమైన ఎనిమిది గాయాలుగా మారింది.
జీవం లేని ఆ వెదురుని
'మోహనమురళి'గా మార్చింది.
గాయపు బాధ కూడా తీయగా ఉంటుందని
నాడు తెలిసింది తొలిసారి.
నాటినుంచి ఆ మురళి 
నీ పేరే గానం చేస్తోంది...
నీ మాటనే అనుకరిస్తోంది....
నీ ప్రేమ సంగీతాన్నే ఆలపిస్తోంది.

నీకు తెలుసు...నీ ప్రేమే ఆ మురళికి శ్వాస అని.
నీప్రేమనెందుకు నానుంచి దూరం చేసావ్?
అపుడు  ప్రేమ సంగీతాన్ని ఆలపించిన మురళి 
ఇపుడు విరహరాగంలో  నిశ్సబ్దంగా  విలపిస్తోంది.

పాతగాయాలు మళ్ళీ రేగుతున్నాయి....
ఆ గాయాల్ని మాన్పే శక్తి నీ ప్రేమ లేపనానికే ఉంది.
మళ్ళీ మధుర సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమకే ఉంది.....
మళ్ళీ జీవన సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమలోనే ఉంది.
                                                                                         @శ్రీ 

08/03/2012

పుష్పాల హోలీ




మురళీధరా!
నీవు పంపిన చేమంతులు నా'చెంప'ను తాకితే
ముద్దబంతులు నా 'పెదవి'ని ముద్దాడాయి.

పున్నాగ పూలు పాలకడలి లాంటి పొట్టను తాకితే..
పొగడపూలు పొక్కిలికి చక్కిలిగింతలు పెట్టాయి.

సంపెంగలు సిగలో చేరితే
మరుమల్లెలు ముఖం మీదుగా  జారాయి.

మందారాలు బుగ్గల సిగ్గుని తాకితే 
కెందామరలు పాదాల ఎరుపుని పలకరించాయి 


సన్నజాజులు సరసమాడితే
విరజాజులు వెన్నెలై కురిసాయి.
పారిజాతాలు పై పైన పడుతూనే ఉన్నా
గులాబీలు గుండెకు చేరువైతే
వాటి గుబాళింపులు 
నా గుండెగుడిలోని నిన్ను ప్రేమతో  స్పృశించాయి

నీ పుష్పవర్షంతో నా తనువంతా 
పులకరించి పరవశించింది....
నీ ప్రణయ పుష్పవర్షంలో తడిసి 
నీకై మరింత కలవరించింది.                                     శ్రీ
                
        ( రాధ కృష్ణుల పూలతో ఆడే హోలీ గురించి విన్నాక ఈ హోలీ నాడు ఈ కవిత అక్షర రూపం  దాల్చింది)

                                                                                                                            

   



















06/03/2012

నిజమైన అందం


నిజమైన అందం


నీ కొప్పున ఉన్న మల్లెలకెంత
 గర్వం? 

ఆ కొప్పుకి వాటి వలెనే  అందం వచ్చిందట.
నా ముఖంపై చెదిరినప్పటి నీ కురుల అందం
అవెప్పుడైనా చూసాయేమో అడుగు?


నీవు కట్టిన తెల్లచీరకెంత బడాయి?
ఆ చీర వలెనే నీ మేనికి అందం వచ్చిందట.
నా ప్రేమతో నేసిన చీర మాత్రమే నీ శరీరానికి
సొగసులద్దుతుందని  ఆ తెల్లచీరకెలా చెప్పను?


ప్రియా!
జీవం లేని వాటి  వల్ల వచ్చే అందం తాత్కాలికం.
జీవంతమైన వాటి వల్ల వచ్చే అందం శాశ్వతం.


నా ప్రేమ లోని ఇంద్ర ధనుస్సు మెరుపులతో 
నీ అందం ద్విగుణీకృతం అవుతుంది.....
నా వలపుతలపుల  వెండి జల్లులోతడిసి
ఆ అందం యింకా మెరుస్తుంది...


అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.
అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.



                                                                    @శ్రీ















































వసంతం





లేత మావిచివుళ్ళను   
ఆరగించిన గండు కోయిల 
మత్తెక్కి చేస్తున్న
మధుర గానలహరి 
ఒకవైపు వీనులవిందు చేస్తోంది.......

లేత  వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తున్న చిలుకలు  
మరొక వైపు సందడి చేస్తున్నాయి.

నవ పల్లవ కుసుమ పరాగాన్ని
మోసుకొచ్చే 'పిల్ల'గాలుల పరిమళం
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

వన్నెల వయ్యారుల 
కొప్పుల మల్లెమాలలు
కొత్త పరిమళాలతో, 
మనసున చెలరేగే 
ఊహలకు
మరింత మత్తెక్కిస్తున్నాయి.

ప్రకృతి కాంత పచ్చని చీరతో...
లతల ఆభరణాలతో...
పూల తేనియ తీయదనంతో...
వసంతపు కొత్త సొగసులద్దుకొని
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.