28/04/2012

ఎదురు చూపులు

ఉదయం లేచింది మొదలవుతుంది 
అంతులేని నిరీక్షణ.... 
నీకు వ్రాసిన ....నా చివరి  
ప్రేమలేఖకి జవాబు వస్తుందేమోనని.

రోజులు, నెలలు
గడిచిపోతున్నాయి....
కాలాలు, ఋతువులు 
మారిపోతున్నాయి...

ఏవీ?నా గుండెపై
గుప్పెడు మల్లెలు చల్లినట్లుండే
నీ ప్రణయ పత్రాలు?

నీ చిలిపి రాతలు చిలికిన
కవ్వింతలు ఎక్కడ?
అవి నా మనసుకి 
పెట్టిన గిలిగింతలు ఎక్కడ?

జవాబు రాని లోకాల నుండి
నా ప్రియతముని లేఖలు
తేలేకపోతున్నందుకు...
జాలిగా చూసే పోస్ట్ మేన్
సజల నయనాలు....
నా కన్నీటి కథను...
మీకు చెప్పకనే, చెపుతున్నాయి కదూ!


                                                 @శ్రీ



                                                  
















26/04/2012

అలిగిన వేళ....


నీ చిరునవ్వుని.. నీలాంబరానికిచ్చేస్తే...
తన  సిగపాయలో, నెలవంకను 
చేసి ముడుచుకుంది........
 నీ కంటి మెరుపులను ... తారలకిచ్చేస్తే...
అవి విద్యుత్ ప్రభలతో
తళుకుమంటున్నాయి ...

నీ నడుము వంపుసొంపులను ...
నదులకిచ్చేస్తే...
అవి మరింత  వయ్యారంగా 
ప్రవహిస్తున్నాయి....






నీ  పెదవుల ఎరుపును....
తామరలకిచ్చేస్తే ..
అవి కెందామరలై  విరబూసాయి... 






నాకు చెప్పకుండా  అన్నీ అలా 
అందరికీ  ఇచ్చేయడమేనా???
అంటూ నీపై అలిగితే,
..........
"నాదగ్గర  నువ్వున్నావుగా!"
అంటూ నా ఎదపై వాలిపోతావు.




                                            @శ్రీ 



































23/04/2012

కంటికి కానరాదని తెలిసీ...


మలయ మారుతంలో...
నీ ప్రణయ పరిమళం తప్ప, 
నీవు గోచరించవేల?


గలగల పారే సెలయేటిలో...
నీ ప్రేమప్రవాహపు వెల్లువ తప్ప, 
నీ రూపు కానరాదేల?


విరబూసిన జాజులలో...
నీ స్నేహసౌరభం తప్ప, 
నీ ఉనికి దొరకదేల?


నీలాకాశపు తారామండలంలో...
నీ కంటి  వెలుగులు తప్ప,
నీవెక్కడా అగుపడవేల?


వెన్నెలకారు వెన్నెలసోనలో...
నీ నవ్వుల జాబిల్లి తప్ప,
నీ జాడ లేదేల?


వేలుపు... కంటికి కానరాదని తెలిసీ....
రేయింబవళ్ళు నా అన్వేషణ ఆగదేల?
                                                             @శ్రీ















21/04/2012

ఓ ఎఱ్ఱబడిన కనుదోయి...



ఓ మనసు మరో మనసునడిగింది....
నా మనసున నీవున్నట్లుగా
నీ మనసులో  నేనున్నానా?అని... 

   ఓ చేయి మరో చేతినడిగింది...
   నా చేయి నీకందిస్తే,
   నీ చేయి నాకందిస్తావా?అని...

ఓ పదయుగ్మం మరో పాదాల జంటనడిగింది...
నేను నడిచే దారిలో
జీవితాంతం  నడుస్తావా?అని...

   ఓ గుండె మరో గుండెనడిగింది...
   నా గుండె చప్పుడు
   నీ గుండెల్లో వినిపిస్తోందా?అని...

ఓ ప్రేమ మరో ప్రేమనడిగింది...
నేను నిన్ను  ప్రేమించినంతగా 
నీవు కూడా నన్ను  ప్రేమిస్తున్నావా?అని... 

     ఓ  ఎఱ్ఱబడిన  కనుదోయి... 
     మరొక ఎఱ్ఱని కన్నుల జంటని...
     అమాయకంగా అడుగుతోంది..
     నాలాగే నువ్వు కూడా రాత్రంతా నిదురపోలేదా?అని...





20/04/2012

వెన్నెల వర్షం



వెన్నెల వర్షంలోని  ప్రతి చినుకు
నను తాకి...ఆవిరౌతుంటే.....

సుగంధభరిత శీతల పవనాలు  
నను తాకి వేసవి వడగాడ్పులౌతుంటే...

గంధపు పూత సైతం 
నా తనువుని  తాకి  పొడిపొడిగా రాలి పోతుంటే....

నీ ప్రేమామృత వర్షమే నను చల్లబరచాలి...
నీ ప్రణయ పవనమే  నా తాపాన్ని తగ్గించాలి...
నీ మేని పరిమళమే  నాకు హరిచందనమవ్వాలి ....                    @శ్రీ 






19/04/2012

ప్రేమ వృక్షం



మరుస్థలి లాంటి  నా  మనస్సులో 

'నీ ప్రేమ' అనే బీజం వచ్చి పడింది.


నా ప్రాణ వాయువులతో పెరుగుతూ...
ఊహించనంత  వేగంగా
మొక్కగా, మానుగా...
ఊడల జడలతో...వృక్షంగా ఎదిగింది.


నా తనువు లోని ప్రతి కణాన్ని
శాఖలుగా, ఆకులుగా, పువ్వులుగా, కాయలుగా
మార్చుకుంది.


కాలాల ప్రభావం...
ఋతువుల ప్రభావం..
పడకుండా నిత్యం పచ్చగా కళకళలాడింది.


ఆ ఊడలతో ఊయలలూగాం...
ఆ నీడలలో సయ్యాటలాడాం.


ఓర్వలేని విధి నవ్వులు...
విషపు అమ్ములై  మానుని ఛిద్రం చేసాయి.


విషాగ్ని కీలల్లో వృక్షం దగ్ధమైపోయింది.
ఆ భస్మం గాలిలో కలిసిపోయింది...
ప్రతి కణం ఎక్కడెక్కడో పడుతోంది...
కొత్త ప్రేమలకు జీవం పోస్తోంది...


నిత్యం ఆ జంటలను చూస్తున్నాను,,,
ఆ ప్రేమలలోనే  మన ప్రేమను చూసుకొని
మురిసిపోతున్నాను....


                                                                        @శ్రీ 















18/04/2012

వయసుకి వయ్యారం





ఓ వయసుకి వయ్యారం వస్తే,
ఓ అందానికి అల్లరి చేరితే,

ఓ సిగ్గుకి సింగారం అద్దితే,
ఓ సంతోషం సందడి చేస్తే,

ఓ వెన్నెల  వేలుపై వస్తే,
ఓ  ప్రేమే స్నేహం చేస్తే,

నా ప్రేమకి ప్రాణం పోస్తే,
నా నీడకి రూపం వస్తే,
అది నీలాగే  ఉంటుంది...

నా మాటలకి,
మనసులో ఆనంద పడుతూ,
ప్రశంసలు వద్దన్నానా !!!
అంటూ నీవు చూపే చిరుకోపం మాత్రం...
అచ్చు నీ ముందున్న అద్దం లానే ఉంటుంది.  @శ్రీ 
                                                                            





17/04/2012

గుండె చప్పుడు

నేను సేకరించిన  నీ  నవ్వుల పువ్వులని...
మాలలుగా అల్లి ఉంచాను, 
నీ నీలికురుల కోసం....

నీ మాటలలో దొర్లిన ముత్యాలను...
కూర్చి ఉంచాను,
నీ గళసీమను అలకరించాలని....


నీ సిగ్గు దొంతరలను...
సోపానాలుగా చేసి ఉంచాను                                       
నా హృదయాన్ని చేరుకొనేందుకు...

ఈ గుండె  చేసే చప్పుడు  ఆగిపోయే
ఒక్క క్షణం ముందైనా వస్తావు కదూ!!!





11/04/2012

శుష్క హాసం


నలుగురిలో ఉన్నా ఒంటరిగానే  ఉంటున్నాను,
పదుగురితో ఉన్నా పరధ్యానంగానే  ఉంటున్నాను.

అందరి నవ్వుల్లో సహజత్వం ఉంటే...
నా నవ్వులోని  కృత్రిమత్వం... 
నాకు కూడా  స్పష్టంగా కనిపిస్తోంది.



నా పెదవిపై విరిసే శుష్క హాసాన్ని..
లోకం గుర్తిస్తోంది...
వింతగా చూస్తోంది...
కారణాలు వెతుకుతోంది...
నన్ను ప్రశ్నిస్తోంది...

మనసులోని  బాధని...
చిరునవ్వుల ముసుగులో దాచాలనే 
నా వ్యర్థ ప్రయత్నం ఇంకెంత కాలం చెయ్యాలో?
నా నిర్జీవమైన చిరునవ్వుకి 
ప్రాణమున్నట్లుగా  చూపాలంటే ఇంకెన్ని రంగులు పూయాలో???

08/04/2012

రాధ 'ప్రశ్న'



'రుక్మిణి ' భక్తికి మెచ్చి ఆమెని  వరించానన్నావు....
'సత్యభామ'ను శమంతకమణితో  స్వీకరించానన్నావు..


'జాంబవతి'ని ఆమె తండ్రి  నీకు సమర్పించిన కానుక అన్నావు...
'కాళింది'ని విష్ణుప్రేమవల్ల చేపట్టానన్నావు....


'మిత్రవింద' నిన్ను  స్వయంవరంలో వరించిందన్నావు... 
'నాగ్నజితి'ని  పోటీలో దక్కించుకున్నానన్నావు ... 


'భద్ర 'నిన్ను ప్రేమతో గెలుచుకుందన్నావు...
'లక్ష్మణ'ను నీ విలువిద్యా కౌశలంతో చేజిక్కించుకున్నానన్నావు...


నాలో అందం,భక్తి, ప్రేమ...
అన్నీ ఉన్నా నన్నెందుకు పెళ్ళాడలేదని అడిగితే...
"పెళ్ళికి ఇద్దరు వ్యక్తులు కావాలి కదా!"అంటావు !!!!!.........
                                                
                                                                              @శ్రీ .

.
























06/04/2012

నీనుంచి దూరంగా


ఒక్కక్కసారి అనిపిస్తుంది 
నాలోని నీనుంచి దూరంగా పారిపోవాలని...
అదే ప్రయత్నంలో.. పరుగు మొదలెట్టాను.


వెలుతురులో, చీకటిలో...
కొండల్లో, కోనల్లో
వనాలలో, రాళ్ళల్లో, రప్పల్లో 
దుర్గమమైన దారుల్లో...



సాగిపోతోంది నా పయనం.
ఎవరూ ఊహించనంత వేగంగా...
గమ్యం లేకుండా.....
ఎవరికీ దొరకనంత దూరంగా...


అలికిడైతే వెనుదిరిగి చూసాను...
నువ్వు,
నీ నవ్వు,
నీ మనసు,
నీ ప్రేమ,
అన్నీ కనిపించాయి 
అలసి సొలసిన వదనంతో...
రక్తసిక్తమైన పాదాలతో......







05/04/2012

భయంతో.....


మనసు పొరల్లో నిక్షిప్తమైన 
నీ జ్ఞాపకాలను తీసి వేద్దామని 
నా గుండె గదుల తలుపులు తెరుస్తుంటాను.

తెరిచిన ప్రతిసారీ,
నీ స్మృతులు....
నన్ను ప్రేమగా పలకరిస్తాయి,
నావైపు సజల నయనాలతో చూస్తాయి,
మృదువుగా నా మనసుని స్పృశిస్తాయి,
ప్రేమ కుసుమాలతో నన్ను అర్చిస్తాయి.



వెంటనే మూసేస్తాను ఆ తలుపుల్ని.
...............
నీ తీపి జ్ఞాపకాలు....
బైటికెళ్లి పోతాయనే భయంతో,
నాకు.... దూరమైపోతాయన్న దిగులుతో....







04/04/2012

చిత్రమే కదూ!


నీ ప్రేమతో ఉండమంటావ్..
నా ప్రేమే నువ్వంటాను....

నీతో ఉండమంటావ్...
నాలోనే నువ్వున్నావంటాను....

నీ మనసులో ఉండమంటావ్....
నా మనసే నువ్వంటాను....

నీ ప్రాణంలా చూసుకుంటానంటావ్...
నా ప్రాణమే నువ్వంటాను....

నీ నవ్వుల్లో నన్నుండమంటావ్...
నా నవ్వుకి కారణం నువ్వంటాను...
నీ కోసం జీవించమంటావ్...
నా జీవితమే నువ్వంటాను....

నీలో సగం నేనంటావ్...
నాలో 'నాకు' చోటు లేదంటాను....
ఇన్ని భిన్నాభిప్రాయాలున్న
మనం కలిసి ఉండటం చిత్రమే కదూ!!!!!!!














అమరత్వం

అంధకార  బంధురమైన  రాత్రి  నేనైతే....
దివ్య దీప్తులు విరజిమ్మే కౌముది నీవు.

జ్వలిత  తప్త మరుస్థలం నేనైతే....
నవ వసంత  నందనం  నీవు.

నా నిర్జీవ జీవితాన్ని 
జీవంతం చేయడానికొచ్చిన..
సంజీవిని  నీవు.



కన్నులు మూసికూడా 
ఉజ్జ్వలమైన  నీ సౌందర్యాన్ని 
నా మనో నేత్రాల ముందు సాక్షాత్కరించుకుంటున్నాను. 

అమృతం తాగిన వాళ్ళందరూ అమరులౌతారని విన్నాను.
నీ ప్రణయ మకరందంతో నా మనసుని ఎప్పుడో తడిపి వేసావు..
మరి నీ అధరామృతాన్ని కూడా కాస్త రుచి చూపి...
నాకు  'అమరత్వాన్ని'  ప్రసాదించవూ?

                                                                                               @శ్రీ 







03/04/2012

తలపు- తలపుకీ మధ్య



నీ తలపులతో  
మొదలవుతుంది 
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో  చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.

నన్నెందుకు 
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....

నానుంచి నీ తలపులను 
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో.... 
నా మనసులోకి తొంగి చూస్తావు.

నిన్ను మర్చిపోవాలనుకొనే 
సమయంలో  
మరీ ఎక్కువ   గుర్తొస్తావ్  సుమా!

దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం  సహజమే...
కాని తలపు- తలపుకీ  మధ్య కూడా 
తలపుల్లోకి  వచ్చేస్తే  ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి 
దూరంగా ఉండడం  ఎలా???

02/04/2012

ప్రేమలేఖలు రాయటం మళ్ళీ మొదలెట్టవూ?

ప్రియా!
నీ ప్రేమలేఖ లోని అక్షరాలు
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు,
నిశ్చలమైన నా మనోకాసారంలో 
వికసించిన  ప్రేమారవిందాలు.

పత్రంలోని భావాలు హరివిల్లు లోని సప్త వర్ణాలైతే,
అ రంగుల దారాలతో కలనేసిన చీరకట్టులో 
నీవున్నట్లే అనిపిస్తుంది ...నా కళ్ళెదుట.

పదాల వెంట పరుగులు తీసే కళ్ళకంటే,
నా మనసే వేగంగా చదువుతుంది...
నీ మనసులోని ప్రతి తలపును.

నీ లేఖలు....
మనసును కమ్ముకున్న చీకటి మేఘాలను 
చెల్లాచెదురు చేసే వెన్నెల కిరణాలు....
వలపు తాపాలను చల్లార్చే మంచు తుఫానులు....
మదిలోనికి  చొచ్చుకోనిపోయే  మదనుని  శర పరంపరలు....

అందుకే అడుగుతున్నాను..
నా మనసు మెచ్చే...
నీ మనసుకి నచ్చే...  
ప్రేమలేఖలు  రాయడం మళ్ళీ మొదలెట్టవూ?  

                                                                        @శ్రీ






01/04/2012

శ్రీ సీతారామ కళ్యాణం


సభంతా కిక్కిరిసి ఉంది.
రాజాధిరాజులు, చక్రవర్తులు, సామంతులు
తమతమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి
శివుని విల్లు ఎక్కుబెట్టి 
'సీత'ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.


ఒక్కక్కరే  ప్రయత్నించి  అవమానభారంతో
వెనుదిరుగుతున్నారు.
జనకుని మనసులో ఆందోళన.
మిథిలాధీశుని పట్టపురాణి ముఖములో 
నిరాశ,నిస్పృహలు అలుముకున్నాయి ....

మైథిలి క్రీగంట శ్రీ రాముని చూసింది.
పురుషులకి సైతం మోహనంగా కనిపించే 
ఆ రూపాన్ని మనసులో చిత్రించుకుంది.
రాముని చూపు సీతపై పడింది...
చూపులు కలిసాయి...
రాముని తనువు విద్యుద్ధనువైతే
సీత మేను సిగ్గుల హరివిల్లే అయింది.

విశ్వామిత్రుని ఆజ్ఞ అయింది
శివధనస్సుని సమీపించాడు రాముడు.
క్షణం  క్రితం చూసిన సీత బరువైన  పూలజడ మదిలో మెదిలింది.
ఈ విల్లునే  ఎ త్తలేకుంటే రేపు ఆ జడనెలా ఎత్తగలను? అనుకున్నాడు.

అలవోకగా శివధనువునెక్కుబెట్టాడు
ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది 
ఫెళ్ళున పిడుగుపాటు ధ్వనితో విల్లు విరిగింది.
సీత పెదవిపై చిరునవ్వు విరిసింది

మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి
సీతమ్మ పెల్లికూతురయ్యింది.
సీతారాములు కళ్యాణమాలలు మార్చుకున్నారు,
ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు.
దేవపారిజాతాల   పుష్పవృష్టిలో  సీతారాములు పరిమళభరితులయ్యారు

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం,
అది లోక కళ్యాణం, జగత్కళ్యాణం,
ఈ విశ్వానికే  నిత్యకళ్యాణం-పచ్చతోరణం.


                                                                                         @శ్రీ 

(అందరికీ ' శ్రీరామనవమి'  శుభాకాంక్షలతో...)