31/05/2012

నీకోసం.......


అన్ని కవితలు వ్రాస్తున్తావు...
నా గురించి ఓ మంచి కవిత అల్లగలవా?
అంటూ సవాల్ చేస్తే, 
ద్యూతానికి పిలిస్తే రానని 
చెప్పలేని ధర్మరాజులా....
సవాల్ స్వీకరించి 
కలం కదపడం మొదలు పెట్టాను....

లేనివి ఊహించి 
అతిశయోక్తి  అలంకారాలు జోడించి...
నా 'ఊహా సుందరి' గురించి 
ఏదో వ్రాసేయడం అలవాటయిపోయింది..

ఇప్పుడు ఎదురుగా ఉన్న వాస్తవం గురించి వ్రాయాలంటే 
బెదురుగా ఉంది...కలం వణుకుతోంది...
భయపడుతున్నానని అనుకుంటున్నావా???
నీ రూపం,
నీ ప్రేమ,
నీ స్నేహం,
అన్నిటి గురించి వ్రాయాలంటే...
నాకు ఉన్న భాషా పరిజ్ఞానం
చాలదేమోనని భయం...
పదకోశాన్ని శోధించినా 
నాకు కావాల్సిన పదాలు దొరకవేమోనని చింత...

అయినా ప్రయత్నిస్తాను... 
నీ సౌందర్యాలాపన  చేయలేమని
రాగాలు సైతం మూగబోయాయి. 

నీ రాజీవ నేత్రాలను వర్ణింపలేమని
పదాలన్నీ సిగ్గుతో నేలచూపులు చూస్తున్నాయి.

నీ స్నేహ మాధుర్యానికి  
మకరందాలు సాటి రావని 
మళ్ళీ విరుల లోతుల్లోకి దారి చేసుకున్నాయి...

నీ ప్రేమామృతానికి 
క్షీరసాగర జనిత సుధలు సైతం పోటీకి రాలేమని
మరల శ్వేతసాగరగర్భం లోనికి
తిరిగి వెళ్లిపోయాయి...

నేను... నీకు దొరికిన 'కానుక'
అని నువ్వు అంటుంటావు గానీ 
నీవు... నాకు దొరికిన 'వరం' 
అని నేనంటాను...

ఏమిటో! మంచి పదాలు 
దొరికినట్లే దొరికి మాయమైపోతుంటే,
అందమైన భావాలు తడబడిపోతుంటే... 
ఏమని వ్రాయను?
నీకు తగిన పదాలు నా కలానికి అందినపుడు 
కాస్తంత అందంగా వ్రాసే ప్రయత్నం మళ్ళీ చేస్తాను ప్రియా!!!...                           @శ్రీ 

29/05/2012

అమ్మా...నీకోసం...


నవమాసాలు మోసి ఉత్కృష్టమైన 
 మానవ జన్మనిచ్చిన నీవు...
 వెండి గిన్నెలోని పప్పుబువ్వను ప్రేమగా 
 గోరుముద్దలు చేసి తినిపించిన నీవు...









పిడుగుపాటుకి ఉలిక్కిపడితే
అక్కున చేర్చుకొని అర్జునా! ఫల్గునా! అనే నీవు...
అలారం కొట్టక  ముందే 
కాఫీ కప్పుతో నన్ను నిద్రలేపే నీవు...



                                                 
వేసవి వేడిలో నీవు మేల్కొని 
నన్ను నిద్రబుచ్చుతూ విసనకర్ర వేసే నీవు...
చలి కాలపు రాత్రులలో మాటిమాటికీ 
కంబళి సరిగా కప్పే నీవు...





పరీక్షలకి చదువుతున్నపుడు 
పెరుగన్నపు ముద్దతో నీవు...
క్లాసులో ఫస్టు వచ్చినపుడు 
పాయసపు పాత్రతో గుమ్మం లోనే ఎదురయ్యే నీవు...



                                       


నాకు విష జ్వరమొచ్చినపుడు  
నాతో బాటు పథ్యం చేసిన నీవు...
నాన్న కొట్టిన దెబ్బలకి
వెన్న పూస్తూ ఓదార్చే నీవు.....






ఇంత వయసు వచ్చినా,
కాస్త నలతగా ఉందంటే చాలు
గంటకోసారి దిష్టి తీసే నీవు...






ఈరోజు నీవు నా చెంత లేకున్నా
నీ ప్రేమ, మమత ,క్షమ 
అన్నీ నాకు రక్షగా ఉన్నాయి...




ఉదయం లేచినపుడు... నా ఎదురుగా...
రోజంతా నా నీడలో ...
రాత్రి నిదురించేటపుడు... స్వప్నంలో...
కనిపిస్తూనే ఉంది కమ్మని మా 'అమ్మ జ్ఞాపకం'




(ప్రాణం కంటే మిన్నగా పెంచిన అమ్మమ్మకు,
గత సంవత్సరం ప్రాణాంతకపు వ్యాధికి బలి అయిపోయిన మా అమ్మకు,
ప్రేమతో...) 

26/05/2012

మల్లెల మాలిక.....






మండువేసవిలో...
కనువిందు చేసే ధవళ కుసుమాలు...
స్వచ్ఛతకు  ప్రతీకలు,
సుగంధాలకి  నెలవులు,
పరిమళాలకు చిరునామాలు.

పడతుల  నీలికురుల తరగల  మెరిసే 'తెల్లని నురుగులు'...
మదనుడు సంధించిన 'శృంగార అస్త్రాలు.'..

చెలి జడలో శోభిల్లే  'చిరు కాగడాలు'...
మనసుల చెలరేగే కోరికలకు 'ఉత్ప్రేరకాలు'....

కన్నెల కొప్పులకు ప్రకృతి ప్రసాదించిన  'శ్వేతాభరణాలు'...
తెల్లని పానుపుపై తనువుని నొప్పించని 'వెన్నెల తునకలు'...

చీకటిలో వెలిగే 'వెన్నెల పుష్పాలు'...
మగువల  చిరు కోపాలకు 'దివ్యౌషధులు'....

ఏకాంతంలో...
నీకోసమే ఎదురు చూసే నాకు మాత్రం....
'విరహాగ్ని'ని మరింత   పెంచే 'ఆజ్యపు చుక్కలు'...

                                                                                          


                                                             @శ్రీ 






























































24/05/2012

సప్త పదాల గమనం...

సప్త ఋషుల సంతతి....
లోకాన జన సంద్రం
సప్త సముద్రాల మయం...
మన  భూగోళం.

సప్త వర్ణాల అపురూప దృశ్యం...
ఒక ఇంద్రచాపం.
సప్తాశ్వాల రథ సారథి ఆగమనం...
తూరుపు దిక్కున అరుణం.

సప్త స్వరాల సమ్మేళనం...                                     
సుమధుర సంగీతం.
సప్త తంత్రులపై నీ ప్రేమ విన్యాసం...
నా మానసవీణా వాదనం.

సప్త పదాల గమనం...
నీతో గడిపే అందమైన జీవితం,
ఎన్నటికీ వాడని దివ్య కుసుమం,
ఏ జన్మకీ  మరువలేని మధుర  స్వప్నం......

                                                              
                                                              @శ్రీ               

22/05/2012

ప్రేమ తపస్సు



అరచేతి వెన్నముద్దలా 'నీ ప్రేమ'ని  చూసుకుంటున్నానని మురిసి పోయాను...
కంటిలోని కాంతిలా కాపాడుకుంటూ వస్తున్నానని సంబరపడిపోయాను..

సమయం గడుస్తుంటే.... స్థితి మారిపోయింది....

అరచేతి వేడిమికి వెన్న ఎపుడు కరిగిపోయిందో తెలియలేదు...
కంటిలోని కాంతి ఎపుడు అదృశ్యమైపోయిందో అర్థం కాలేదు.. 

ఆ కరుగుదల మొదలైన తొలిక్షణం ఎపుడో నీవైనా చెప్పవూ?
మాయమైన ఆ కాంతిపుంజం ఎక్కడుందో కాస్తంత వెదికిపెట్టవూ?

గడచిన సమయం మరల  రాదని తెలుసు...

నీకు వింత అనిపించినా సరే...
కాలచక్రాన్ని  వెనక్కి తిప్పే అసాధ్యమైన పనిని మొదలెట్టేసా!
నీ ప్రేమని మళ్ళీ పొందాలనే తపస్సు నేటినుంచే ఆరంభించేసా!

19/05/2012

నీ దివ్య నేత్రాలు




శ్రీ || నీ దివ్య నేత్రాలు ||

ప్రభూ!
నీ దివ్యచక్షువులను దర్శించాక,
ఇక యే చంచలనేత్రాలను
చూడ మనసగుటలేదు...

సుందరనయనాలెన్నో  చూసానింతవరకు,
వాటిలోనే మూర్ఖంగా వెతుక్కున్నాను 
అందాన్ని యింతకాలం...

నీ  నేత్రాలలో
విశ్వజనీనమైన  వాత్సల్యం
అవ్యాజమైన ప్రేమ
మలయపు చల్లదనం
నేడు మనో నేత్రానికి గొచరమౌతున్నయి 

ఒకకంటితో   
సూర్యుని  ధవళ కాంతులను  శాసిస్తూ,
వేరొక  కంటితో
ఈ జగతికి 
వేయి పున్నముల వెలుగునిస్తున్నావు.

నీ నయనాలు
జలపుష్పాలను తలపిస్తూ 
నీరజ దళాలంత
నిశ్చలంగా  ఉన్నాయి.
చలాచలానికి సాక్షిగా...


ఆ  చూపులచల్లదనం  
నాపై ఎపుడూ ప్రసరించనీ ...
ఆ  నేత్రద్వయం
చూపే  వెలుగులో  నీ సన్నిధి చేరనీ...   @శ్రీ 

                                                                           





16/05/2012

సూర్యచంద్రులంటే కోపం....








సూర్యుడంటే కోపం....                                                                  చంద్రుడంటే కోపం... 
త్వరగా  వెళ్లిపోలేదని.                                                                  తొందరగా రాలేదని.

కౌముది సమక్షంలో... 
వెన్నెల నలుగు పెట్టుకొని,
వెండి చినుకుల్లో స్నానమాడి 
నీవు నాకోసం వచ్చేది ఈ రాత్రే కదా!

సన్నజాజి పందిరి కింద...  
నీ నవ్వుల పువ్వులు  
నా గుండెను అభిషిక్తం చేసేది  
ఈ నిశలోనే కదా!

తూగుటుయ్యాలపై...
నీ చేతివేళ్ళ
తమలపాకు చిలుకలు...
నా నోట పండి...
నీ అధరాన పగడమయ్యేది 
ఈ రేయి లోనే కదా!

నీ ప్రేమామృత ప్రవాహంలో... 
కాలం క్షణాల్లో కరగిపోయేది 
ఈ రాతిరి లోనే కదా!

అందుకే,
సూర్యుడంటే  కోపం...
వేగంగా వచ్చేసాడని,
చంద్రుడంటే కోపం... 
కనికరం లేకుండా త్వరగా వెళ్లిపోయాడని......
                                                                          @శ్రీ 

13/05/2012

రిక్షావోడు


మండుటెండలో ...
స్వేదంతో తడిసి,అలిసిన ముఖంతో ...                           
నెత్తిన చుట్టిన కావి రంగు తుండుతో...
బేరాలకోసం ఎదురుచూసే రిక్షావోడు ....
ఎండ, వాన, చలి...
ఏ కాలమైనా పట్టెడన్నం కోసం 
చెమట చిందించ వలసిందే...

టాక్సీలకిస్తాం 
మీటరు ప్రకారం డబ్బులు....
ఆటోలకిస్తాం
మీటర్ పై అదనంగా పైసలు...
బేరమాడటానికి మాత్రం దొరికిపోతాడు....
....పాపం రిక్షావోడు.

హోటల్లో సర్వరుకిస్తాం టిప్పు...
గేటు తీసి, సలాము కొడితే 
నిర్లక్ష్యంగా విసిరేస్తాం ఓ పచ్చనోటు....
ఎత్తు వచ్చినపుడు తాను దిగి,
మన బరువుని పళ్ళబిగువున లాగే
రిక్షావోడికి  మాత్రం వదలం ఒక్క రూపాయి కూడా.

మూడు చక్రాలను  బాలన్సు చేస్తూ...
శక్తి  సామర్థ్యాలు అదనంగా ధారపోసి....
మూడు, నాలుగు చక్రాల మోటారు వాహనాలకి పోటీనిస్తూ....
ఎక్కువ సార్లు తానోడినా ,
తన బ్రతుకు తెరువు కోసం,అస్తిత్వం కోసం
నిరంతరం పోరాడే  రిక్షావోడంటే.... ఎందుకంత చులకన???

ప్రతి పోరాటానికీ రాటు దేలుతూ..
సమస్యని చూసి మడం తిప్పని  ఆ యోధుడే
నా  జీవనపోరాటానికి స్ఫూర్తి....



08/05/2012

నక్షత్రాల చేవ్రాలు

ప్రత్యూషపు కాంతి...
అరుణ వర్ణంతో మెరుస్తోంది...... 
నే సరసమాడే సమయాన,
ఎరుపెక్కిన నా చెలి  సిగ్గుల గులాబి బుగ్గలా...... 

గ్రీష్మపు అపరాహ్నం
అగ్ని చినుకులు కురిపిస్తోంది .....
నా ప్రేయసి నాపై  అలిగినపుడు  వదిలే
వాడి-వేడి వాక్కుల బాణాల్లా  .....

సాయం సంధ్యా సమయంలో...
చల్లగా వీచే  పిల్ల తెమ్మెర 
హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన 
ప్రణయ సమీరంలా  ....

రజనీ కాంతపై  వెన్నెల రాజు 
రజత వర్షం కురిపిస్తున్నాడు....
నా చీకటి గుండె పై....
నా నెచ్చెలి చేసిన  అక్షర  నక్షత్రాల  చేవ్రాలులా......

03/05/2012

గుప్పెడంత 'నా మనసు'



'నీ అందం' 
కాళిదాసు వర్ణనలకు అందనిది...
'నీ రూపం'
రవివర్మ కుంచెకు దొరకనిది...

'నీ ప్రేమ' 
నేను యుగయుగాలకీ వరంగా అడిగేది....
'నీ సోయగం' 
ప్రకృతి కూడా 'ప్రామాణికం' అనుకునేది.....

ఎవరికీ అందని నిన్ను...
గుప్పెడంత  చోటులో బంధించి 
అందరి వంక గర్వంగా చూస్తోంది
నీలో ఉన్న 'నా మనసు'.......     
                                                  @శ్రీ 

02/05/2012

కను రెప్పల మధ్య దూరం...


మన  ప్రేమల మాట  ఎలా ఉన్నా,
మనం ఒకరికొకరు  దూరంగా.. 
ఉన్నామన్నది మాత్రం పచ్చి నిజం.


ప్రపంచం చిన్నది అయిపోయింది..
దూరాలు తగ్గిపోయాయి...
అని అందరూ అంటున్నారు.


ఇప్పుడు కూడా.........                               
నది.... సముద్రంలో కలవాలంటే
వేల మైళ్ళు  పరుగులెత్తాల్సిందే ....
వెన్నెలకాంతులు.... కలువని తాకాలంటే...
లక్షల మైళ్ళు పయనించాల్సిందే...

నిన్ను నేను చేరాలంటే ఎంత దూరం 
వెళ్ళాలో చెప్పగలనేమో కానీ,

రాత్రి అయితే చాలు, 
నీకోసం చూసి చూసి,
ఒకదానికొకటి దూరమైపోతున్న 
నా కను రెప్పలను కలపాలంటే....
వాటినెంత దూరం ప్రయాణం చేయించాలో 
మాత్రం చెప్పలేక పోతున్నా...... 


                               



                                                                                                @శ్రీ 

  
 






 

 






 






01/05/2012

కళ్ళు చెప్పే" ప్రేమవేదం"



నీవెప్పుడు మాట్లాడినా 
కదిలే నీ పెదవుల వైపు చూడను, 
నీ కళ్ళలో మెదిలే నీ మనో భావాల్ని 
కళ్ళతోనే  చదువుతుంటాను....

నా మీద ప్రేమ ఉందా?
అని ప్రశ్నిస్తే.... 
కనులు మూసుకొని 
మౌనం వహిస్తే ఎలా?

మనసులో ఎగసిపడే భావ తరంగాలను 
కళ్ళలో ప్రదర్శించేందుకు జంకు ఎందుకు?
నీలి కన్నులపై రెప్పల  పరదాలు వేసి 
నీ  ప్రేమను దాచడమెందుకు?

ఆ ప్రేమ గవాక్షాల తలుపులు నెమ్మదిగా తెరుచుకోనీ!
నీ కంటిలోని నా రూపుని ఈ  లోకం చూడనీ!
నీ కళ్ళు చెప్పే" ప్రేమవేదాన్ని" అంతా మనసారా విననీ!

                                                                      @శ్రీ