28/11/2012

అంబరాన జాబిలి




నీలి అంబరం
అంబరాన జాబిలి
జాబిలితో వెన్నెల
వెన్నెలలో నీవు
నీతో నేను...

నేను చూసే చూపులు
చూపులలో ఆరాధనలు
ఆరాధనలో ఆత్మీయతలు
ఆత్మీయతలో దగ్గరతనాలు
దగ్గరతనంలో పెరిగిన చనువులు
చనువుల్లో ముందడుగులు
అడుగులే సప్తపదులు


సప్తపదులలో జీవన సంగీతాలు
సంగీతంలో సరాగాలు...
సరాగాల్లో సరసాలు
సరసాలలో నీ సిగ్గులు...
సిగ్గులతో ఎరుపెక్కిన బుగ్గలు
బుగ్గలని తాకే నా వేళ్ళు
వేళ్ళు తుంచే మొగ్గలు...
మొగ్గలతోనే మాలలు...
మాలలే మన శయ్యకి పరదాలు...

పరదాలలోనే శృంగారాలు
శృంగారంలో వణికే అధరాలు 
అధరాల్లో తోణికే సుధలు...
సుధాల్ని గ్రోలే పెదవులు...
పెదవుల్లోని ఎరుపులు
ఎరుపుని దొంగిలించే కలువలు
కలువలను తాకే వెన్నెలతీగలు
వెన్నెల తీగలనల్లుకునే నిండుచంద్రుడు
నిండు చంద్రునికి ఆధారం.......నీలి అంబరం....   @శ్రీ 28/11/2012





23/11/2012

దుఃఖం


దుఃఖం... నిన్ను  దాచాలంటే 
అందరికీ సాధ్యం కాదని తెలుసు...
పెల్లుబికే ఉప్పెనను రెండుకళ్ళలో
దాచటం అంటే మాటలా?

బిందువులో సింధువును 
చూపడం సులువే గానీ 
గుప్పెడంత గుండెలోని శోకాన్ని 
ఆల్చిప్పలాంటి ఆ కళ్ళలో దాచటం ఎంత కష్టం?

ఆనందబాష్పాలు చిందిస్తే 
బుగ్గల మీద జారిన 
కన్నీటి  చుక్కలు సైతం 
వెండి తళుకులతో మెరుస్తూ 
ఆనందాన్ని ప్రతిఫలిస్తాయి...
కాంతిని విఫలం (వక్రీభవించి) చేసి 
సప్తవర్ణాలను వెదజల్లుతాయి.

వేదనతో, ఆవేదనతో 
ఆ కళ్ళు వర్షించే 
ఆమ్లధారల  ధాటికి
లేత గులాబి బుగ్గలపై  
ఎప్పటికీ మిగిలిపోయే 
చారికలుగా  నిలిచిపోతాయి...

ముఖాన్ని...
కృత్రిమముఖంలో 
దాచేసుకున్నా 
ఆ ముఖం పైన కూడా 
నీ అవశేషాలు 
స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి...

మనస్సంద్రంలో 
నిలువెత్తు కెరటాలతో ఎగసిపడే 
దుఖాన్ని వర్షించాలంటే 
వేయి కళ్ళు కావాల్సిందే...
వేలనదులై పారాల్సిందే...

నిన్ను నా చిరునవ్వులో 
దాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
ఆ చిరునవ్వునే కన్నీరు కార్పించే శక్తి 
నీకు ఎవరిచ్చారో?


                                                           



17/11/2012

అపురూపం నీ చెలిమి...




నేస్తం...
నీతో స్నేహమంటే...
ఏమిటో చెప్పనా?..
అందరిలాగే నాలుగు 
అందమైన పదాలు జోడించి 
అంత...ఇంత...అంటూ 
పోగిడేస్తావ్...అంతేగా!
అంటూ పెదవివిరుస్తావు...

ఎలా చెప్పేది?
ఎప్పటినుంచో 
వెదుకుతున్న 
ఆత్మీయతల నిధి 
ఇప్పటికి దొరికిందని.
అనురాగాల సన్నిధి 
నేటికి దొరికిందని...

భావ సారూప్యం
ఉన్న నేస్తం దొరకటం
నింగినున్న జాబిలి 
ఒక్క సారి దోసిలిలో పడినంత 
చల్లని అనుభూతినిస్తుందని 
ఇప్పటిదాకా తెలియదు సుమా!...

స్నేహం చేయడం 
ఎంతో సులువు.
అది నిలుపుకోవటం
చాలా కష్టమంటూ 
వ్రాసిన సూక్తులు ఎందుకో నచ్చావు నాకు.
అమలిన స్నేహాన్ని కష్టపడి 
వెతుక్కోగలిగితే 
ఆ స్నేహం నిలుపుకోవడం 
ఎంత సులభమో  అనిపిస్తుంది.

ఎన్ని  గనులు వెదికానో తెలుసా...
నాకు కావలసిన 
వరాల వజ్రాన్ని
పట్టేందుకు.
ఎన్ని వనాలుతిరిగానో 
నెయ్యాల నేమలీకను 
సాధించేందుకు...

శుక్లపక్ష పాడ్యమినాడు
మసక వెలుతురులా 
కనిపిస్తూ... 
దినదిన ప్రవర్ధమానమౌతూ 
నిండు పున్నమి నాటికి 
కోటిదివ్వెల కాంతులతో 
వేలతారల వెలుగులా 
శ్వేతప్రభలతో వెలిగే 
వెండివెన్నెలలా 
ఎప్పటికీ వన్నె తగ్గనిదై ఉండాలి 
మన స్నేహం.

ప్రాతఃకాలపు నీడలా 
ఉండకూడదు
మన స్నేహం...
అపరాహ్నపు ఎండలో... 
బిందువు నుంచి క్రమక్రమంగా 
పెరుగుతూ మనకంటే ఎత్తుగా ఎదిగి పోతూ 
అనంతంగా పెరిగిపోతూ... 
నిశీధిలో కలిసి కరిగిపోయే 
నీడలా ఉండాలి మన స్నేహం.

రెండు స్వార్థపూరితమైన 
మనసుల మధ్య స్నేహం 
కలకాలం నిలవదు...
నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది...
నా సంతోషంలో నీ కంట పన్నీరొలకాలనే స్వార్థం నీది...
ఇలాంటి స్వార్థాల స్నేహం మాత్రం కలకాలం నిలవాలి సుమా!...@శ్రీ 

11/11/2012

ముఖపుస్తకపు మనోహరి




ఎవరో తెలియదు...
ముఖం చూడలేదు..
ఎక్కడుంటావో  తెలియదు..
ప్రత్యక్షంగా నీతో స్నేహం లేదు..
ముఖపుస్తకంలో కనిపిస్తుంటావు.
అందరితో బాటు మామూలుగా పలకరిస్తుంటావు.

భావ కవిత్వంలో భాషిస్తావు...
మణిమాలికలో మాధుర్యాన్ని చూపిస్తావు...
పద్యనగరిలో విహరిస్తావు...
ఏక్ తారలో హృదయ తంత్రిని మీటుతావు...
కవుల సమూహాల్లో కవితా సుమాలు వెదజల్లుతావు...


నీ ప్రతి అక్షరాన్ని ఆరాధిస్తాను 
వాటిలోని ప్రతిభావాన్నీ ఆస్వాదిస్తాను...
నీ భావానికి నేనేమని వ్యాఖ్యిడితే 
నీవు ఆనందిస్తావో అనుకుంటూ 
ఆలోచించే సమయం 
నేనో కవిత వ్రాసేందుకు పట్టే కాలం కంటే ఎక్కువే.

నా భావవ్యక్తీకరణకు నీ స్పందన కోసం,
ఎదురు చూడటం అలవాటుగా మారింది...
నీ స్పందన లేకుంటే గుండె పిండినట్లుంటుంది 
కనీసం ఇష్టపడ్డట్టు కనిపిస్తే సంతృప్తిగా ఉన్నట్లుంటుంది 


నా అక్షరాల్ని ప్రేమిస్తున్నట్లు..
నా భావుకత్వాన్ని ఇష్టపడుతున్నట్లు 
నా కవితలను క్రమం తప్పక చదువుతున్నట్లు..
వాటికై రోజూ ఎదురుచూస్తున్నట్లు...
తెలిసే నీ స్పందనలోని  పదపారిజాతాలు 
నా మదిలో నిత్యం గుబాళిస్తూ ఉంటాయి...

అనునిత్యం నాతొ ఉన్న మిత్రుల స్నేహం కంటే 
నీ స్నేహం ఎంత అపురూపంగా కనిపిస్తుందో తెలుసా?
మన భావ సారూప్యత వల్లనే ఏమో ఇదంతా!

నీ శుభ ప్రభాతంతో తెరుచుకొనే సందేశాల పెట్టె 
నీకు శుభరాత్రి అని చెప్పాకే మూత  పడుతుంది....
మధ్యలో ఆ పెట్టె ఎప్పుడు వెలిగినా 
నీ పలకరింపేమోనని ఆశగా తెరుస్తుంటాను...

ప్రత్యక్షంగా కనపడక,వినపడక 
వేల మైళ్ళ దూరంలో ఉన్నావో...
కూతవేటు దూరంలో ఉన్నావో తెలియదు గానీ,
నా మనసుకి మాత్రం నీ శ్వాస లోని 
వెచ్చదనాన్ని నేను గుర్తించేంత దూరంలో ఉంటావు...


నీ అక్షరాల్లోని అందమైన రూపాన్ని బట్టి 
నీ సౌందర్యం అంచనా వేసే ప్రయత్నం చేస్తుంటాను...
అయినా ముఖపుస్తకపు ముసుగు తీసి ఎన్నడూ 
నాకు కనిపించకు నేస్తం...
నాకు నచ్చేటి అందం నీలో లేదని నిరాశ పడతానని 
అనుకుంటున్నావా?
కాదు కాదు...
నా ఊహకందని సౌందర్యం నీలో కనపడితే..
అందని అందాన్ని అందుకోలేకున్నానని... 
నా కవితల్లో విరహం ఎక్కువైపోతే 
అది నా కవి మిత్రులు పసిగడతారని భయం...

శైలి మారితేనే  పసిగట్టే సత్తా ఉన్నవాళ్ళు వారు...
భావం మారితే ఆట పట్టించరూ! ...    @శ్రీ 














09/11/2012

అందుకే నీవంటే నాకు ఎంతో ఎంతో



కనురెప్పల చప్పుళ్లకే ఉలికి పడతావెందుకంటే...
'ఎంత అమాయకంగా అడుగుతావ్...
నీ  కళ్ళల్లో పెట్టి చూసుకుంటావే..
ఆ మాత్రం తెలియదూ?'
అంటూ ఎంత ముద్దుగా 
కసురుకుంటావ్?

గుండె చప్పుళ్ళకే 
బెదిరిపోతావెందుకంటే...
'ఆ గుండెలో ఉన్నది నేనే కదూ?'
అంటూ 'ఎంతో 'ప్రేమగానూ...
'కొంచెం 'సందేహంగానూ 
అడుగుతావ్...

నీ పేరు పలికిన ప్రతిసారీ 
సిగ్గుపడతావెందుకంటే...
'ఆ పెదవులు నా పేరును 
ముద్దాడితే సిగ్గు కాదా మరి?'..
అంటూ బిడియంగా 
బదులిస్తావు...

నన్నింతగా ఎందుకు
ఆరాధిస్తావంటే...
'ఆరాధనకు బదులుగా  
ఆరాధించడం...
నీవేగా నేర్పింది?'
అంటూ తెలివిగా 
సమాధానమిస్తావు...

నీకు నేనేమిచ్చానంటే... 
'నాకు మనసిచ్చావు, 
జీవితాన్నిచ్చావు,
గుప్పెడు గుండెకు 
పట్టని ప్రేమనిచ్చావు,'
అంటూ  నన్ను పొగుడుతూ 
నాకు లేని గొప్పతనాన్ని 
ఆపాదిస్తావు...

మరు జన్మలో 
తోడు ఉంటావు కదూ!
అంటే మాత్రం...
"మరొకర్ని కల్లో కూడా ఊహించకు "
అంటూ కళ్ళెర్ర జేస్తావు...

అందుకే నీవంటే నాకు ఎంతో ఎంతో ...@ శ్రీ           





03/11/2012

ప్రేమంటే నీకు తెలుసా?




ప్రేమంటే నీకు తెలుసా? 
అంటూ అలా ఒక్కసారిగా 
అడిగేస్తే ఎలా?

ప్రత్యూషపు కాంతి 
నిన్ను చూసి
ఇంకా తెలవారకుండా 
వచ్చానేమిటా???
అంటూ సందేహించే సమయంలో...
రాత్రంతా ధనుర్మాసం చలిలో 
మంచులో తడుస్తూ...
చుక్కల ముగ్గులేసేందుకు 
నువ్వెప్పుడొస్తావో...అనుకుంటూ 
నీకోసం  ఎదురు చూసే 
కళ్ళలోకి చూస్తే తెలిసేది 
నీవంటే నాకు ఎంత ఆరాధనో?

పొలం గట్లపై 
వయ్యారంగా నీవు నడుస్తూ 
మన్మథుని చేతి కొరడా లాంటి 
నీ వాల్జడ ఝుళిపిస్తే 
ఒక్క సారైనా 
నా ముఖంమీద 
తగలకపోతుందా?
అనుకుంటూ ఆశగా 
నీ వెనుక 
వేసే సడిలేని నా అడుగులు 
గమనిస్తే తెలిసేది 
నీవంటే నాకు  ఎంత ఇష్టమో?

నేను సైకిలు కొనుక్కున్నా,
దాన్ని నీకు పదడుగుల 
దూరంలో 
మెల్లగా నడిపిస్తూ
మనమధ్య దూరాన్ని మనో నేత్రం తో 
అంచనా వేస్తూ...
నీ సిగలో పువ్వో..
నీ నవ్వుల సిరిమల్లియో 
జారిపడితే 
ఎపుడు దోసిలి పడదామా?
అనుకొనే 
నా ఆరాటం చూస్తే తెలిసేది 
నీపై నాకు ఎంత ఇష్టమో!

క్లాసులో 
నీ అరచేతిలో పడిన 
బెత్తపు దెబ్బ
నా కంటికి ఛళ్ళున 
తగిలి తుళ్ళి పడిన 
నీటిచుక్కని చూస్తే తెలిసేది 
నీవంటే నాకెంత ప్రేమో!...

శరద్పూర్ణిమ నాటి 
జలతారు వెన్నెలలో...
చలువరాతి తీరాన్ని చూస్తూ 
నర్మదా ప్రవాహంలో 
నౌకా విహారం చేస్తూ...
మెలమెల్లగా నేను  చుక్కాని వేస్తూ....
నా ప్రేమ మీద నీకు సందేహమా?
అంటూ నిన్నడిగే ప్రశ్నకి 
బదులివ్వక 
మౌనమే  సమాధానమంటూ...
'చిన్నగా నవ్వే 
నీ మనసులో నామీద దాచుకున్న
అనంతమైన  ప్రేమ'ను 
అడిగితే తెలిసేది నీవంటే నాకెంత ప్రేమో?

ఎన్ని జన్మల బంధమో!
అని నీవంటే 
ఇదే 'తొలిజన్మ' అయితే 
ఎంత బాగుంటుంది ?
అనుకునే నా స్వార్థాన్ని 
అడిగితే తెలుస్తుంది నీవంటే 
నాకు ఎంత ప్రాణమో!

ఇన్నేళ్ళయినా 
తరగని ప్రేమ నాదంటే 
నాదని ఇప్పటికీ 
మనం  ప్రేమగా పోట్లాడుకొనే 
ఆ మధురమైన 
దృశ్యాన్ని చూస్తే....
తెలుస్తుంది 
.....
నీవంటే నాకు,
నేనంటే నీకు 
ఎంత ప్రేమో! అని .................                             -@శ్రీ