09/03/2012

జీవన మురళి




జీవం లేని వెదురు నా మనసు.
మన్మధ బాణం లాంటి   నీ చూపుతో.. 
నా మనసుకి చేసావు గాయం.

నెమ్మదిగా ఆ గాయం
అందమైన ఎనిమిది గాయాలుగా మారింది.
జీవం లేని ఆ వెదురుని
'మోహనమురళి'గా మార్చింది.
గాయపు బాధ కూడా తీయగా ఉంటుందని
నాడు తెలిసింది తొలిసారి.
నాటినుంచి ఆ మురళి 
నీ పేరే గానం చేస్తోంది...
నీ మాటనే అనుకరిస్తోంది....
నీ ప్రేమ సంగీతాన్నే ఆలపిస్తోంది.

నీకు తెలుసు...నీ ప్రేమే ఆ మురళికి శ్వాస అని.
నీప్రేమనెందుకు నానుంచి దూరం చేసావ్?
అపుడు  ప్రేమ సంగీతాన్ని ఆలపించిన మురళి 
ఇపుడు విరహరాగంలో  నిశ్సబ్దంగా  విలపిస్తోంది.

పాతగాయాలు మళ్ళీ రేగుతున్నాయి....
ఆ గాయాల్ని మాన్పే శక్తి నీ ప్రేమ లేపనానికే ఉంది.
మళ్ళీ మధుర సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమకే ఉంది.....
మళ్ళీ జీవన సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమలోనే ఉంది.
                                                                                         @శ్రీ