16/03/2012

మనం





నా ప్రేమ ఒక హిమనదం లాంటిది.
దానికి నిరంతరం  ప్రవహించడం తప్ప,
ఆగడం తెలియదు.
నా ప్రేమ ఒక సాగరం లాంటిది
ఆ సాగరం లోతు నీకెప్పటికీ  తెలియదు.

నా ప్రేమ ఒక నిశ్శబ్ద సంగీతం లాంటిది.
మనసుతో మాత్రమే వినగలిగేది.
నీ మనసు మాత్రమె వినగలిగేది.
నా ప్రేమ మలయ పవనం లాంటిది.
నీ కంటికి కనపడనిది.
నీకు ఆహ్లాదాన్నిచ్చేది.

నా ప్రేమ  "నువ్వు-నేను"
లేక  "నేను-నువ్వు "కాదు
విడదీయలేని  శబ్దం 'మనం'.
విడదీయరాని శబ్దం 'మనం'

సదా జపం




నీ కిలకిలారావాలను మరువలేక
నా మనసెంత కలవర పడుతోందో తెలుసా నీకు?
నీ చివురాకు పెదవి మధువు మరువలేక
నా పెదవి పడే బాధ నీకెలా తెలుస్తుంది?

నీ మేని స్పర్శ  మరపునకు రాక
నా తనువు పడే తత్తరపాటు నీకెలా తెలుస్తుంది?
నీ మేని విరుపుల మెరుపులు మరపునకు రాక 
నా కనులనుభవించే బాధ నీకెలా తెలుస్తుంది?

నీకోసం,
నీ మాట కోసం,
నీ నవ్వు కోసం,
నీ ప్రేమ కోసం,
నీ స్పర్శ కోసం...
సదా జపం చేసే 
'సదాజపుడిని' అయిపోయాను నేను...
'నిత్యజపుడిని' అయిపోయాను నేను.












నీకోసం నేనేమివ్వగలను?


ఒంపుల  సొంపుల వయ్యారి నదిలా
ప్రవహించే నన్ను పలకరించి
పులకరించే నీకోసం వేచి చూసాను....
నీ జాడ  తెలియలేదు....



వేగాల జలపాతాన్నై,
ఉత్తుంగ తరంగాన్నై
ఉరికినప్పుడు
ఆ ఉరుకుల పరుగుల  నురుగులలో
తడిసి,మురిసి పరవశించేందుకు నీవు రాలేదు.


ఆనకట్టలో ఒదిగి ,
చేనుగట్టులో నిలిచి
పచ్చని పైరుగా మారిన నాకోసం వచ్చిన నీకు ...
నేనేమివ్వగలను.....
నీకోసం నేనేమి చేయగలను?