సూర్యుడంటే కోపం.... చంద్రుడంటే కోపం...
త్వరగా వెళ్లిపోలేదని. తొందరగా రాలేదని.
కౌముది సమక్షంలో...
వెన్నెల నలుగు పెట్టుకొని,
వెండి చినుకుల్లో స్నానమాడి
నీవు నాకోసం వచ్చేది ఈ రాత్రే కదా!
సన్నజాజి పందిరి కింద...
నీ నవ్వుల పువ్వులు
నా గుండెను అభిషిక్తం చేసేది
ఈ నిశలోనే కదా!
తూగుటుయ్యాలపై...
నీ చేతివేళ్ళ
తమలపాకు చిలుకలు...
నా నోట పండి...
నీ అధరాన పగడమయ్యేది
ఈ రేయి లోనే కదా!
నీ ప్రేమామృత ప్రవాహంలో...
కాలం క్షణాల్లో కరగిపోయేది
ఈ రాతిరి లోనే కదా!
అందుకే,
సూర్యుడంటే కోపం...
వేగంగా వచ్చేసాడని,
చంద్రుడంటే కోపం...
కనికరం లేకుండా త్వరగా వెళ్లిపోయాడని......
@శ్రీ