31/05/2012

నీకోసం.......


అన్ని కవితలు వ్రాస్తున్తావు...
నా గురించి ఓ మంచి కవిత అల్లగలవా?
అంటూ సవాల్ చేస్తే, 
ద్యూతానికి పిలిస్తే రానని 
చెప్పలేని ధర్మరాజులా....
సవాల్ స్వీకరించి 
కలం కదపడం మొదలు పెట్టాను....

లేనివి ఊహించి 
అతిశయోక్తి  అలంకారాలు జోడించి...
నా 'ఊహా సుందరి' గురించి 
ఏదో వ్రాసేయడం అలవాటయిపోయింది..

ఇప్పుడు ఎదురుగా ఉన్న వాస్తవం గురించి వ్రాయాలంటే 
బెదురుగా ఉంది...కలం వణుకుతోంది...
భయపడుతున్నానని అనుకుంటున్నావా???
నీ రూపం,
నీ ప్రేమ,
నీ స్నేహం,
అన్నిటి గురించి వ్రాయాలంటే...
నాకు ఉన్న భాషా పరిజ్ఞానం
చాలదేమోనని భయం...
పదకోశాన్ని శోధించినా 
నాకు కావాల్సిన పదాలు దొరకవేమోనని చింత...

అయినా ప్రయత్నిస్తాను... 
నీ సౌందర్యాలాపన  చేయలేమని
రాగాలు సైతం మూగబోయాయి. 

నీ రాజీవ నేత్రాలను వర్ణింపలేమని
పదాలన్నీ సిగ్గుతో నేలచూపులు చూస్తున్నాయి.

నీ స్నేహ మాధుర్యానికి  
మకరందాలు సాటి రావని 
మళ్ళీ విరుల లోతుల్లోకి దారి చేసుకున్నాయి...

నీ ప్రేమామృతానికి 
క్షీరసాగర జనిత సుధలు సైతం పోటీకి రాలేమని
మరల శ్వేతసాగరగర్భం లోనికి
తిరిగి వెళ్లిపోయాయి...

నేను... నీకు దొరికిన 'కానుక'
అని నువ్వు అంటుంటావు గానీ 
నీవు... నాకు దొరికిన 'వరం' 
అని నేనంటాను...

ఏమిటో! మంచి పదాలు 
దొరికినట్లే దొరికి మాయమైపోతుంటే,
అందమైన భావాలు తడబడిపోతుంటే... 
ఏమని వ్రాయను?
నీకు తగిన పదాలు నా కలానికి అందినపుడు 
కాస్తంత అందంగా వ్రాసే ప్రయత్నం మళ్ళీ చేస్తాను ప్రియా!!!...                           @శ్రీ