26/06/2012

తెలిసీ....అలిగితే ఎలా???




నీకోసం వ్రాసే కవితలన్నీ
నీకు అందించమంటూ
తరచి తరచి అడుగుతుంటావు.

శ్వేత కపోతాలకై
మొదలెట్టాను వేట.
సిద్ధం చేసుకున్నాను...
కట్టేందుకు పట్టు తాళ్ళు.
లేఖలు గమ్యం చేరవేమో
అనుకుంటూ భయపడ్డాను.

ప్రతి కవితనీ 
అందమైన పత్రాలపై వ్రాసాను...
శ్వేత సరోజాల రేకులను
రెక్కలుగా చేసాను...
హరివిల్లుని కొంచెం కిందికి దించి
ఆ వర్ణాల్లో ముంచి తీసాను...
వాటి అందానికి 
నాలో నేనే మురిసి పోయాను...
నా మనసు వేగాన్ని
ఆ లేఖలకిచ్చేసాను...

సుధాంశుని అంశవైన 
నీ ముందు వాలిపోయాయి..
ప్రణయ రాగ వాయులీన నాదాలకి
పరవశించాయి...
రెక్కలు విప్పి 
సిరివెన్నెల నాట్యంలో భాగమయ్యాయి...

నాకోసమే  వ్రాస్తానని
మోసం చేసానన్నావు...
అన్నీ  మనిద్దరి కోసం 
వ్రాసానని  అలిగి కూర్చున్నావు...

నీకోసం వ్రాద్దామనే మొదలెడుతున్నాను...
ముగింపు మాత్రం 'నువ్వు-నేనుతోనే పూర్తవుతోంది...
నా ప్రతికవితకి ఊహవు నీవైతేఉత్తేజం నేనని,
నీతోనే నేను సంపూర్ణం అని
నీకు తెలిసీ....అలిగితే ఎలా???      
(చిత్రం ఆధారంగా అల్లిన అక్షర మాలిక...@శ్రీ )