06/07/2012

నా చెవిలో...నా పేరే...



తొలికోడి కూత...
అలారం మోత...
పాలవాడి కేక...
పేపరువాడి అరుపు...
ఏవీ వినిపించటం లేదు.

కాలింగ్ బెల్ సౌండు...
కుక్కర్ విజిల్...
మైక్రోవేవ్ బీప్...
వాషింగ్ మెషిన్ టైమరు శబ్దం...
అసలు తెలియడం లేదు...

అనుక్షణం నా చెవిలో 
నా పేరే..మాటిమాటికీ వినిపిస్తోంది...
ఎందుకో తెలియటం లేదు...
ఈ వింత సమస్యకి పరిష్కారం దొరకడం లేదు...

డాక్టర్ టెస్టులన్నాడు...
స్కేనింగులన్నాడు...
అరకు వేసాడు...
చెవి క్లీన్ చేసాడు...
వైద్యులందరిదీ ఇదే వైద్యం...
బోలెడు ఫీజు అయింది వారికి నైవేద్యం...
అయినా ఫలితం శూన్యం...

నీకు చెప్తే గేలిచేస్తావేమోనని భయం...
నాలో చేసుకున్నాను అంతర్మథనం...
తెలిసింది దీని వెనుక ఉన్న రహస్యం...
చెప్పేస్తా విను సాంతం....


పెళ్లి అయినప్పటి నుండి 
ప్రతిరాత్రి నాకిష్టమైన నీ గుండెలనే
తలదిండుగా చేసుకొని పడుకుంటుంటే,


నీ హృదయస్పందనల నేపథ్య సంగీతంతో,
నీ గుండెలోతుల్లోనుంచి
నిముషానికి 72 సార్లు
నా పేరే నా చెవికి మధురంగా వినిపిస్తుంటే,

నిద్ర లేచాక కూడా అదే పేరు 
చెవిలో పదే పదే  తీయగా ప్రతిధ్వనిస్తుంటే,
......
మరో శబ్దం నా చెవినెలా చేరుతుంది చెప్పు???