10/07/2012

శ్రీకృష్ణ జననం





తమ కళ్ళముందే..
ఆరుగురు శిశువులను
కంసుని కర్కశ ఖడ్గం బలితీసుకోగా......
సప్తమ గర్భం విచ్చిన్నం కాగా...

అష్టమ గర్భంతో దేవకి...
కోటి ఆశలతో వసుదేవుడు...
ఈ సారి జన్మించే శిశువు 
కంసుని పాలిటి మృత్యువు కావాలని ప్రార్థిస్తూ 
ఎదురు చూసే సమయంలో....

శ్రావణ బహుళ అష్టమి...
అర్ధరాత్రి...
చెరసాలలో...
సప్తఋషుల  మంత్రపఠనం వినిపిస్తుండగా...
వేదనాదాలు ప్రతిధ్వనిస్తుండగా...
దేవతలు సుమవర్షం కురిపిస్తుండగా...
గంధర్వులు గానం చేస్తుండగా...
అప్సరాంగనలు   నాట్యం చేస్తుండగా...

కనులు మిరిమిట్లు గొలిపే దివ్య ప్రభలతో...
ఒక ఇంద్రనీలమణి
ఉద్భవించినట్లుగా,....  
విద్యుల్లతలతో  మెరుస్తూ
ఒక నీలమేఘం...
నింగి నుండి నేలను వ్రాలినట్లుగా...

నల్లని పూర్ణచంద్రునికి 
నెలవంక అద్దినట్లుండే చిరునవ్వుల మోముతో...
అరవింద దళాయతాక్షుని  జననం...

దుష్ట శిక్షణకు...శిష్ట రక్షణకు నడుము  బిగించి 
శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారం...
అదే....శ్రీ కృష్ణావతారం........ 

(శ్రీకృష్ణాష్టమి రోజు నాటికి ఆయనకిష్టమైన అష్టమ సంఖ్యలో కవితాసుమాలను  సమర్పించుకుందామనే   ప్రయత్నంలో...
 మొదటి కవితను సమర్పిస్తున్నాను మీ ముందు...@శ్రీ )