02/12/2012

సహ జీవనం




సహ జీవనం....
ఎంత అందమైన పేరు?
జీవితంలో 
నీకోసం నీ పెద్దలు వెదికి
లేదంటే నీకు తగిన
 సోల్ మేట్ లభించి 
వేద మంత్రాల మధ్య (ఎవరి మతానికి  వారు అన్వయించుకోవచ్చు...)
సప్తపది సాక్షిగా 
ఓ తరాన్ని సృష్టించేందుకు 
చేసేది సహజీవనం

ఒకరి మీద ఒకరికి నమ్మకం
భిన్నాభి ప్రాయాల్లో ఏకాభిప్రాయాలు...
ఒకరికొకరు కావాలనుకొని..
ఒకరిని విడచి మరొకరు 
బ్రతకలేమనుకొని...
ఆడంబర వివాహాలకి దూరంగా...
కుల మతాలకు అతీతంగా...
ఒకరిని కోసం  మరొకరు...
ఓ జీవితకాలం 
కలిసి జీవించడాన్ని కూడా 
సహజీవనం అనొచ్చేమో!....

ఆరు నెలలకి మగడిని మార్చి...
ఏడాదికి సహచరిని మార్చి...
సహజీవనం పేరుతొ చేసేది 
సహజీవనమా?
చట్టబద్ధమైన వ్యభిచారమా?

వయసు వేడిలో
యవ్వనపు జోరులో...
ఉడుకు రక్తానికి ఎదో కావాలనే తపనతో 
కొత్త రుచులకి అలవాటు పడుతూ...
పూటకో బట్ట మార్చినంత 
సులువుగా 
భాగస్వాములను మార్చేస్తూ
సహజీవనంలో కొత్తదన్నాన్ని 
వెతుక్కునే ప్రయత్నం 
చేస్తోంది నవతరం...

దానికి వత్తాసు పలుకుతోంది 
ఆధునిక పంథాను 
అనుసరిస్తున్నామనుకొనే 
ఆడ/మగ బుద్ధి జీవుల సమూహాలు...

పవిత్రమైన 
వైవాహిక వ్యవస్థకి జన్మనిచ్చిన చోటే...
ఒక పటిష్టమైన బంధం లేని 
సహ జీవనమని చెప్పే 
విషసంస్కృతి 
తన విషపు చుక్కలు 
స్వచ్చమైన సమాజంలో 
వెదజల్లుతోంది...

ఈ రోజు దాకా నీతో ఉన్న 
సహచరుడు 
రేపటి నుంచి 
నీ చెల్లితో సహజీవనం
చేస్తాననే మాట 
అశనీ పాతంలా 
నిన్ను తాకినపుడు...

నీతో మొహం మొత్తింది 
నీ తమ్ముడే నాకు సరిజోడీ 
అని నీ భాగస్వామి 
నీతో చెప్పినపుడు....

నాన్నా!
ఇదిగో నీ ఆరో కోడలు...
అంటూ నీ కొడుకు ..
అమ్మా!
ఇదిగో 
నీ  అల్లుళ్ళ సంఖ్య
తొమ్మిదికి చేరింది 
అంటూ నీ కూతురు...
అన్నపుడు 
తెలుస్తుంది 
'సహజీవనం' అనేది 
ఎంత భయంకరమైనదో?...

పిల్లలు పుడితే 
తండ్రి ఎవరో తెలియని పరిస్థితి...
అమ్మతో ఉండాలో 
అమ్మ ..'నాన్న' అని చెప్పిన 
నాన్నతో ఉండాలో తెలియని అనిశ్చితి...
ఫాదర్స్ నేమ్ అంటే...అందరివీ వ్రాయాలా ?
అంటూ అమాయకంగా 
అడిగే పిల్లల్ని ఒక్క సారి మనో చిత్రంలో 
ఊహించుకుంటేనే భయంకరంగా ఉండే 
సహజీవనం అందమైనదా?....

ఎప్పుడు తెగిపోతుందో?
ఎన్నాళ్ళుంటుందో?
తెలియని బంధం 
సహజీవనమనిపించు కుంటుందా?...

అందమైన కలగా కనిపించే 
దుస్వప్నాల జగత్తులోకి 
ప్రవేశం ఎందుకు?...
పూల బాటలా కనిపించే...
అగ్నికణాల... కత్తుల దారిలో 
అడుగు మోపే దుస్సాహసం ఎందుకు?... శ్రీ