24/12/2012

అదృశ్య బంధం




ఎక్కడో నువ్వు... 
ఇక్కడ నేను...
ఒకరితో ఒకరు 
నిత్యం మాట్లాడుతున్నాం...
ఒకరినొకరు 
చూసుకుంటున్నాం...
భావాలు పంచుకుంటున్నాం...
చిత్రాలు పంపుకుంటున్నాం
తలపులు చేరవేసుకుంటున్నాం...

నిన్ను నన్ను దగ్గర చేసిందదే అయినా 
దాని వలెనే నీ పలకరింపులు 
నిత్యం వింటున్నా, 
ఎందుకో అదంటే నాకింత అసూయ?

నీ మెడలో ఉంటె 
నీ ఎద సవ్వడి వింటుంటుంది
నాకంటే చేరువగా ఉన్నట్లుంటుంది...
మాట్లాడుతుంటే 
నా ఊపిరి కంటే దగ్గరగా...
నీ ముత్యాల జూకాలను స్పృశిస్తూ..
చెవిని వెచ్చగా తాకుతూ...
నునుపైన నీ చెంపను ముద్దాడుతూ 
"నీకంటే నీమాటలు వినిపించే నేనే ప్రియం"
అంటూ వెక్కిరిస్తుంటుంది...

నాకు సందేశాలు పంపే 
నీ చేతివేళ్ళ లాలిత్యం 
తనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో!
నీ ప్రేమ సందేశం చదువుతుంటే...
మునివేళ్ళతో నా గుండెల మీద అక్షరాలు వ్రాస్తూ...
నీ ఎదలోని  భావాలకు 
పద రూపం ఇస్తూ...
నీ వలపు సిరాతో...
నేరుగా నా హృదయ పత్రంపై 
లిఖిస్తునట్లుంటుంది...

నా ఎదురుగా 
నీవుసిగ్గుతో చెప్పలేని భావాలు 
నీ సందేశాలలో కనిపిస్తూ...
నా కళ్ళు సైతం సిగ్గుపడేలా చేసేస్తాయి...

కాల్ లాగ్ లో...
డయల్ చేసిన నంబర్లలో,
రిసీవ్ చేసుకున్న నంబర్లలో ,
మిస్ కాల్స్ లో ,
మొదట నువ్వే కనిపిస్తూ...
నువ్వు నాకు దూరంగా ఉన్నావనే భావాన్ని 
దగ్గరకు రానీయదు...

నీ పిలుపుకి 
సైలెంట్ లో సైతం పెద్దగా మోగేస్తుంది.
నీ మాటల ముత్యాలను
పోగు చేసుకుంటుంది... 
నా మనసుపై మల్లెల్లా చల్లగా కుమ్మరిస్తుంది...


నువ్వు నేను ఒక్కటయ్యేంత వరకూ...
మన 'మన 'లోని అనుభూతుల గుచ్చాన్ని 
అదృశ్యంగా బంధించే దారం...ఆధారం ఇదే కదూ!....  @శ్రీ