17/02/2013

కౌగిలింత





కౌగిలింత అంటే...
ఆకుపచ్చని తీగ పైకి పాకుతూ 
పందిరిలోని ప్రతి కర్రనూ 

ఆధారంగా చేసుకుంటూ
అల్లుకుపోవడమే.

ఉరుముతోనే పుట్టినా 

ఆ గర్జనకు భయపడుతూ
పరుగుపరుగున వచ్చి 

నల్ల మేఘాన్ని
మెరుపుతీగ 

చుట్టుకోవడమే.

పున్నమి వెలుగుల్లో 

మెరిసే తరగలు 

వడివడిగా ముందుకి కదులుతూ
ఎగసి పడుతూ
తీరాన్ని కమ్మేసుకోవడమే.

స్వాతిచినుకు కోసం 

ఆర్తిగా ఎదురు చూస్తూ
చినుకు పడిన వెంటనే 

ముత్యంగా మారకముందే 

తుళ్ళిపోతుందనే భయంతో 

చిప్పల మూతలతో 

బంధించేయడమే...

కన్నులు తెరిచి నిన్నే చూస్తూ 

నీ రూపాన్ని టక్కున పట్టేసి 

కనుపాపల్లో దాచేసుకుంటూ
రెప్పల చేతులతో 

నిను కదలనివ్వక బంధించేదే... 


నిన్న నీ తోడైనాను, 

నేడు నీ నీడైనాను,
రేపు నీతోనే ఉంటాను 

అంటూ ప్రతినిత్యం 

నిన్నల్లుకునే 

కాంక్ష లేని నా ప్రేమపాశమే... ...@శ్రీ







4 comments:

  1. రియల్లీ సూపర్ శ్రీ చాల చక్కగా రాసావు అందమైన పదములతో గ్రేట్

    ReplyDelete
  2. శ్రీ లక్ష్మి ...ధన్యవాదాలు నీ ప్రశంసకు ...@శ్రీ

    ReplyDelete
  3. అద్భుతమైన భావన

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు లక్ష్మీ గారు ... మీ అద్భుతమైన ప్రశంసకి ..@శ్రీ

      Delete