27/03/2013

వలపుల తలపుల హోలీ



|| వలపుల తలపుల హోలీ ||

ప్రతి రాత్రి నా కళ్ళతో నీ జ్ఞాపకాలు ఆడేది హోలీనే
ఎర్రనిరంగు కళ్ళకి జీరగా మార్చేస్తూ 

రవికిరణం తుషారకణాలతో హోలీకి 
ఎప్పుడూ సిద్ధమే సప్తవర్ణాలతో

నీవు నామనసుతో ఆడేది హోలీనే
అసంఖ్యాకమైన వర్ణాలను నాలో నింపేస్తూ

సాగరాకాశాలకి నిత్యం హోలీనే
ఒకరికొకరు నీలి వర్ణం పూసుకుంటూ.

మాధవుడు రాధమ్మతో హోలీ
నీలాన్ని కనకపుష్యరాగమయం చేస్తూ.

నా తీపిఊసులు నీతో ఆడేది హోలీనే
గులాబిరంగు సిగ్గులబుగ్గలకి పూస్తూ.

ఆదిత్యుని హోలీసంధ్యా సుందరితో 
చెక్కిళ్ళలో కెంజాయరంగుని చిత్రిస్తూ..

రజనీకాంతుని హోలీ నిశాసుందరితో, 
తనువంతా రజతవర్ణశోబితం చేస్తూ.

వసంతుని హోలీ
కొమ్మకొమ్మనూ వేల(వేళ్ళ) వర్ణాలతో కొంటెగా స్పృశిస్తూ.

శ్రీ కలం హోలీ...
అక్షరాల్లో సప్తవర్ణాలను నింపేస్తూ,
భావాలకి వేలరంగులు పులిమేస్తూ.
కవితా కన్యకను కోటి రంగులతో అలంకరిస్తూ...@శ్రీ 

17/03/2013

శాకుంతలం -2.


క్రూర మృగాల సంచారం...
విషకీటకాల ఝుంకారం...
దినకరుని తేజాన్ని అడ్డుకొనే వృక్షాలు..
గలల పారే సెలయేళ్ళు...
పచ్చని గుబురు పొదలు...
సుమసంపదతో అతిశయించిన లతలు  
అవే ఆ అడవికి అందాలు...

నేల తల్లి అక్కున జేర్చుకొంది...
రాలినపూల పక్క పరిచింది...
మారుతం మెల్లగా వీచింది...

అడవి కోళ్ళు సుప్రభాతాలు పాడితే 
కోకిలలు  జోలపాటలు  పాడాయి 
మయూరాలు నృత్యంతో అలరించాయి
తేనెధారలు పెదవిపై కురిసాయి...
పండ్ల రసాలు దప్పిక తీర్చాయి...

మౌని తపం మళ్ళీ  మొదలైంది...
మేనక ఇంద్రుని కొలువు చేరింది...
ఒంటరి శిశువుకు  అన్నీ తానే అయింది...
"కారణజన్మి"కి వనదేవతే  మాతృమూర్తి అయింది...

ఆ పసిపాప ఆక్రందనం... 
మహర్షి కణ్వుని శ్రవణం...
ఒక ప్రేమకావ్యానికి ఆరంభం...
ఒక దేశ చరిత్రకు శ్రీకారం...



07/03/2013

శాకుంతలం 1







||మేనకా విశ్వామిత్రం ||...శాకుంతలం 1

నిప్పులు చెరిగే ఎండ
మౌనిపై మంచులా కురిసింది.
హోరున కురిసే వర్షం
చల్లని విరిజల్లుగా మారింది
గడగడలాడించే చలి
వెచ్చని కంబళిలా కప్పింది.

క్రూర మృగాలు
సాధు జంతువులై
తాపసి ముందు మోకరిల్లాయి.
విషసర్పాలు
అమృతం చిమ్మాయి.

ప్రకృతి ఆతని ఆధీనమైంది.
ఘోరతపానికి జోహారులంది.
ఆ క్రోధ వీక్షణానికి
ఐరావతం వెనుదిరిగింది.
వజ్రాయుధం సైతం వణికి పోయింది


నింగి నుండి
ఓ విద్యుల్లత  పృథ్విని రాలింది.
తపం తాపమైంది.
కమండలం దూరమైంది.
దర్భాసనం పూల పానుపైంది.
తాపసి మనసు.
అద్భుత  సౌందర్యానికి
దాసోహమంది.
తపమాచరించిన పెదవి
ఆమె మెడవంపులో తలదాచుకుంది.
జప మాలను తిప్పే చేయి
నిమ్నోన్నతాలను సవరించింది.
ప్రకృతి స్తంభించింది
విశ్వామిత్రం మేనకలో మమేకమైంది...@శ్రీ