18/05/2013

విరహోత్పాతం


నాటా మాట ఉగాది సంచిక-2013 లో ప్రచురించబడిన నా కవిత 



శ్రీ || విరహోత్పాతం ||

తొలిసారి విన్న నీ పలకరింపు
తీయగా నా చెవిలో
నాదనర్తనం చేస్తూనే ఉంది

తొలిసారి పంపిన నీ ప్రేమ సందేశం
చదివిన కళ్ళు
సిగ్గు పడిన విషయం
తలిచే నా మది...
నిత్యం మంకెనపూలు పూస్తూనే ఉంది.

తొలిసారి నిన్ను చూసిన క్షణం
నా కళ్ళలో మెరిసిన మెరుపు
నా చీకటి మదిని
కాంతివంతం చేస్తూనే ఉంది.

తొలిసారి నీ చేతిని తాకిన క్షణం.
మంచుపూలు సుకుమారంగా
ఎదపై జారిన ఆ అనుభూతి...
గ్రీష్మాన్ని సైతం హేమంతంగా మారుస్తూనే ఉంది.

'నిన్ను' మాత్రమే ప్రేమిస్తున్నాననే
అందమైన నిజాన్ని విన్న
విప్పారిన కళ్ళు ఆశ్యర్యంగా చూసిన
చూపుల తాకిడి నా ఎదలో సృష్టించిన
తరగల నురుగుల్ని నా మనసు
ముఖానికి రుద్దుకుంటూనే ఉంది.

నా ప్రేమ ఊసుల్ని బిడియంగా విన్న
నీ చెవి లోలకుల కదలిక
గుండె గడియారంలో
వలపు డోలనాలు చేస్తూ,
మనసుని ప్రతి క్షణం ఉల్లాసపరుస్తూనే ఉంది.

నీ చేతి గాజుల్ని సవరించిన
చూపుడువేలుతో
దేనిని తాకినా ఆ సవ్వడినే తలపిస్తూ
వళ్ళంతా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

నీతో కలిసి నడిచిన ప్రతి అడుగు
నీవు లేకుండా కాలు కదపనని
మొరాయిస్తూనే ఉంది.

నీ పెదవెంగిలి చేసిన శీతల పానీయపు గొట్టం
నీదైన జ్ఞాపకాల అలమరలో
ఇంకా భద్రంగానే ఉంది.

నీతో గడిపిన ప్రతి మధుర క్షణం
నీవు లేని చేదు జ్ఞాపకాన్ని సైతం
తీయని తేనియలా మార్చేస్తూనే ఉంది.

మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా,
ఆకలితో ఉన్న అజగరం...
చిక్కిన లేడిని నిదానంగా మింగుతున్నట్లు
నీ వియోగం నన్నుకబళిస్తూనే ఉంది,
విరహ తిమిరం... వలపు వెలుగుని తాగేస్తున్నట్లు
అంతులేని విషాదం
నా ఆనందాన్ని అహరహం అదిమేస్తూనే ఉంది. @శ్రీ.