06/12/2014

శ్రీ వాక్యం - అవార్డులు - ఇంటర్యూ

















నా "శ్రీ వాక్యం" పుస్తకానికి wonder book of world record వచ్చిన నేపథ్యంలో
http://sumamala.blogspot.in/ అనే వైవిధ్య భరితమైన చక్కని బ్లాగ్ ను నిర్వహిస్తున్న
శ్రీమతి రమణి రాచపూడి గారు చేసిన ఇంటర్వ్యూ ని http://kuwaitnris.com వారు పబ్లిష్ చేసారు
హృదయ పూర్వకమైన ధన్యవాదాలు http://kuwaitnris.com నిర్వాహకులకి 
శీమతి రమణి రాచపూడి గారికి  _/\_ 

http://kuwaitnris.com/2014/12/06/%E0%B0%8F%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D/

18/09/2014

శిశు వేదన







గర్భంలో పడినప్పటినుంచీ పరీక్షలే.
తెలుస్తూనే ఉంది...
నేనెవరో తెలుసుకోవాలనే నాన్న ప్రయత్నం 
కనబడుతోంది...
డాక్టరమ్మకి నాన్నమ్మ ఇస్తున్న లంచం.

చలి పుట్టిస్తోంది... 
అమ్మ పొట్ట మీద పూసిన చల్లని జెల్
భయం పుట్టిస్తోంది...
నిశ్శబ్దంగా పరీక్షాయంత్రం చేసే చప్పుడు.
తల, మెదడు, కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నా, 
అసలు పరీక్షలోనే విఫలమయ్యానని స్పష్టమైంది.

అన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా...
రక్షించుకోవాలనే అమ్మ ప్రయత్నం 
వధించాలనే నానమ్మ పన్నాగం
వాళ్ళమ్మ మాట జవదాటక 
అమ్మతనాన్ని చంపే నాన్న నిశ్చయం 
గుట్టుచప్పుడు కాకుండా
నన్ను మట్టుబెట్టేందుకు ఊపిరిపోసుకుంటున్న యుద్ధతంత్రం

ఓ దుర్ముహూర్తంలో 
వైద్యుని నాటుమందు అయింది...అమ్మకి విందు
ఉన్న కాస్త చోటులోనే
తప్పించుకోవాలని పరుగులు తీసాను
అలిసిపోయి...మృత్యువుకి దొరికిపోయాను

పైనుంచి చూస్తూనే ఉన్నా...
మరో ప్రాణికి ప్రాణం పోయాలనే
ప్రయత్నంలో మునిగిన  అమ్మానాన్నలను.
చూడాలి ఈసారైనా...
తమ్ముడు పుడతాడో?...
మరో చెల్లి ప్రాణం పోతుందో?                                          @శ్రీ

11/09/2014

|| కనులుతెరచి చూసాను - తెలుగు గజల్ || (200 వ పోస్ట్ )


             ( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో  )



నీకోసమె ప్రతినిమిషం వేచిచూసి అలిసాను 
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను 

పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను 
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను 

నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను 

చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా    
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను

ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ 

|| తెలుగు గజల్ ...నువ్వు నవ్వావని ||













నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని 
వనమంతా విరులైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని 
కలతంతా  సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని

మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని 
ఎదలోనే  రవమైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని 

#నెలరాజా కనిపిస్తే  తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని   ... @శ్రీ 

|| నువ్వు నేను ||













నా తలపులలో నిలుస్తావు 
నీ జ్ఞాపకాలతో బాధిస్తావు
నిన్ను నేను తలపుగా భావిస్తున్నా,
జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను 



జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా
చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా
వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు
మదిని ప్రేమగా పలకరించేవి నీవైనజ్ఞాపకాలు.




మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా
నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ
నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా
సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ...
మునుముందుకి సాగిపోతున్నా.

నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతో



అడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమే
ఎదసంద్రంలో అలవైతే ధమనుల్లో తేనెల పరుగులే ...
ఎదసవ్వడి నువ్వనే నిశ్శబ్దమై మిగిలున్నా
నా గమ్యం నువ్వనే ఏడడుగులు వేస్తున్నా.




సవ్వడి నేనైతే నీమువ్వల రవళితో జత కలుపు
గమ్యం దూరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు

07/09/2014

|| నమో బాపు ||


నాకలోకానికి కొత్తరంగులద్దుతోంది
అంచెలంచెలుగా ఎదిగిన 'బాపు' కుంచె 

అప్సరలంతా లైను కట్టేసారు 'బాపు' ముందు 
మా బొమ్మలు కూడా అందంగా  వేయమంటూ

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 'బాపు'ని
దేవలోకానికి ఆస్థాన చిత్రకారునిగా 

సంపూర్ణ రామాయణాన్ని మళ్ళీ తీస్తున్నారు 'బాపు'
మేకప్పక్కర్లేని దేవతలే పాత్రధారులుగా.

భూలోకంలో దేవకుమారుల వేట మొదలైంది 
'బాపు' చూపిన చిత్రాల్లోని (బొ)కొమ్మల కోసం

'బాపు'కే  ఇచ్చాడు విశ్వకర్మ...
తాను నిర్మించే భవనాల గోడలపై చిత్రాలు గీసే కాంట్రాక్టు.

బ్రహ్మ కూడా శిష్యుడయ్యాడు 'బాపు'కి
అందరి నుదిటి రాతలు మరింత అందంగా వ్రాద్దామని 

పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు...దేవతలు 
బాపు కార్టూనుల ప్రదర్శనలు చూసి.

సరసన చోటిచ్చారు దేవతలు 'బాపు'కి 
తమని...తమకంటే బాగా చిత్రాల్లో చూపాడని.

ఒక్కదేవుడైనా ఇవ్వలేదు శతాయుష్షు...
అందరికీ తన రేఖాచిత్రాలలో ప్రాణం పోసిన 'బాపు'కి 






   



03/08/2014

|| స్నేహమంటే ఇదే ||






అందరికీ  స్నేహితుల రోజు శుభాకాంక్షలు ...@శ్రీ 
(HAPPY FRIENDSHIP DAY TO ALL MY FRIENDS )

స్నేహమంటే ... సాగారాకాశాలదే...
యోజనాల దూరంలో ఉన్నా
కల్పాలైనా కలుసుకోకున్నా
క్షితిజం దగ్గర కలిసినట్లనిపిస్తూ
దివారాత్రాలనే భేదం లేకుండా
ఒకదానినొకటి చూసుకుంటుంటాయి

ప్రతిఫలాపేక్ష లేకుండా పలకరిస్తుంది గగనం.
పగలు... కొన్ని వెలుగురేకులు చల్లుతూ
రాత్రి ... గుప్పెడు చల్లనికాంతులు చిలకరిస్తూ

సంద్రం ప్రతిబింబిస్తుంది అంబరాన్ని
పగటి కాంతుల మిలలను చూపుతూ
తారల తళుకుల అందం చూసుకొనే అద్దమౌతూ.
ఆవిరిపూలతో మేఘాలను నిర్మిస్తుంది
కృతజ్ఞతలను మౌనంగా తెలియజేస్తుంది
కమ్మని స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటుంది.

స్నేహమంటే పువ్వుదీ...పరిమళానిదే.
మొక్కనుంచి వేరైనా
నిర్దాక్షిణ్యంగా తుంచేసినా
కడదాకా కలిసే ఉంటాయి
వేరుచేయడం అసంభవం.
విడివిడిగా చూడానుకోవడం అసాధ్యం

స్నేహమంటే మనదే...
నీ కన్ను దుఃఖిస్తే నామనసు చమరిస్తుంది
నా మనసు శోకిస్తే నీ గుండె భారమౌతుంది.
ప్రేమలో ఉండే స్వార్ధాన్ని మన స్నేహం జయించింది.
స్నేహంలోని మాధుర్యాన్ని జగతికి చాటి చెప్పింది. ...@శ్రీ
03/08/2014

21/07/2014

|| కవిత్వమంటే ||






|| కవిత్వమంటే || 

పట్టెడు అక్షరాల్లో 
పుట్టెడు భావాలు గుప్పించడమే.

అక్షరాలకి
అందమైన భావాల రంగులు పూయడమే.

అక్షర(య)గనుల్లో
భావాల మణులను వెలికితీయడమే.

అక్షరఖడ్గాలతో
భావప్రహారాలు చేయడమే.

అక్షరాణువులతో
భావవిస్ఫోటనం చేయడమే.

అక్షరలక్షలతో
భావాలను అమూల్యం చేయడమే.

అక్షరసుమాలతో
భవ్యమైన భావమాలికలు అల్లడమే.

అక్షరవిత్తులతో
భావాలసేద్యం చేయడమే.

అక్షరకపోతాలకు
భావవ్యక్తీకరణలో స్వేచ్చను నేర్పించడమే.

అక్షరాలతో అలవోకగా ఆడుకోవడమే
పదాలతో పదనిసలు పలికించడమే
అక్షరాల ఇటుకలతో భవ్యమైన భావసౌధాలు నిర్మించడమే...@శ్రీ

|| నా వసంత కౌముది ||









ఏ నీలిసాగరాల తరంగాలు నేర్పాయో
నీ కురులకి ...నా ఊపిరుల వాయులీనాలకి నాట్యమాడమని

ఏ విలుకాడు నేర్పాడో శరప్రయోగాలు 
నీ కన్నులకి ...గురితప్పకుండా నా మదిని భేదించమని

ఎ నదులు నడుం బిగించాయో
నీ నడుముకి కొత్త ఒంపులు నేర్పేందుకు

మావి చివుళ్ళు మెక్కిన ఏ కోయిల నేర్పిందో గానాలు
నీ గళానికి...మత్తెక్కించే గానంతో నన్ను వశపరుచుకోమని

ఏ దివ్యసుమాల మకరందం గ్రోలాయో
జుంటితేనెల మాధుర్యాన్ని మాటలలో కలిపే నీ అధరాలు

ఎ లతల వద్ద నేర్చాయో నీ బాహువులు
ఇంత చక్కని అల్లికలు...నను వదలని పెనవేతలు

ఎన్ని పున్నములు కలగంటున్నాయో
నీ వన్నెల నృత్యానికి యవనికగా మారాలని

ఎన్నెన్ని వసంత కౌముదులు పోటీ పడుతున్నాయో
నాలో నీవు కుమ్మరించిన వసంతాలకి నీడగానైనా ఉండాలని

నా కనులు ఎన్ని కలలలో స్వప్నాలు చూస్తున్నాయో
నీతో కలిసే ప్రతి స్వప్నం...కలలో కూడా కల్లలు కాకూడదని...@శ్రీ 

|| సుకుమారివి నీవే ||












విరబూసిన సౌందర్యం 
విరిసిన నీ ముఖారవిందం
భ్రమరాలకి ఆకర్షణం
అందాలకి నందనం...



సిరి మల్లెల మెరుపును ధిక్కరిస్తోంది
నెలవంకను తలపించే చిరునవ్వు
కంటివెలుగును అడుగుతాయి తారకలు
ఒక్క రేయికైనా ఆ తళుకులను తమకీయమని.



కన్నె ప్రాయపు అందాలు
మనసు దోచే సౌందర్యాలు
సౌందర్యాల నిధివి నీవు
నిశి ఎరుగని రాకాశశి నీవు
వెన్నెల పంచే వన్నెల విసనకర్రవి
నిండు అమాసకి సైతం పున్నమినిచ్చే ముగ్ధవి.



నీలిసంద్రం తరగలకి ఉరుకులు నేర్పుతూ
నీ నుదుటిని ముద్దాడే ముంగురులు.



వెన్నెలకే వన్నెలను అందించే
కాంతుల దొన్నెలు నీ కన్నులు
దేవశంఖం లాంటి నీ మెడకు అలంకారంగా
నీ నవ్వులమాలికనే నీకర్పించాను ముత్యాలసరంగా.



అందాలకు పాఠాలు నేర్పిస్తావు
అందంగా ఎలా ముస్తాబవాలో
సెలయేటికి గలగలలు నేర్పిస్తావు
నీ మాటల పరవళ్ళతో



సౌందర్యాల నిధివి నీవే
నిశి ఎరుగని రాకాశశి నీవే
సౌకుమార్యానికి కోమలత్వం నేర్పే సుకుమారివి నీవే

॥ నాన్న॥












మలిబడికి తొలిమెట్టు 'నాన్న' 
బైటి ప్రపంచాన్ని చూపే దివ్య దృష్టి 'నాన్న' 



కొడుకు బైక్ కోసం
తన సైకిల్ జీవితాన్ని పొడిగిస్తాడు 'నాన్న' 
కూతురు చలువటద్దాల కోసం
పగిలిన అద్దాలలోనుంచే ఫైళ్ళు చూస్తాడు 'నాన్న' 



మేఘంలా గర్జిస్తూ
కరుకుగా కనబడతాడు 'నాన్న'
తొలకరిజల్లు లాంటి ప్రేమను

మదిలో దాచుకుంటాడు 'నాన్న' 


పండుగలకి పుట్టినరోజులకి
కొత్తబట్టలున్నాయంటాడు 'నాన్న'
పిల్లల సంబరాల అంబరంతో
మాసికల చొక్కాను కప్పేసుకుంటాడు 'నాన్న' 



తాను ముళ్ళబాటలో నడిచినా
పిల్లలకి పూలబాటౌతాడు 'నాన్న'
అహర్నిశలూ కుటుంబశ్రేయస్సుకే
తన జీవితాన్ని అర్పిస్తాడు 'నాన్న' 



నాన్నంటే నిస్వార్ధానికి
మారుపేరని నమ్ముతాను
నాన్నంటే 'విశ్వరూపమని'
విశ్వానికి ఎలుగెత్తి చాటుతాను. ...@శ్రీ

॥ గోరింట పంట ॥






ఆషాఢం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది గోరింట 
నీ సుతిమెత్తని చేతిలో పండిపోవాలని 
సిగ్గులజల్లుతో తడిపేస్తుంది గోరింట నీ చేతిని
హరితమేఘమై కమ్ముకుంటూ



నీ అరచేత పండిన గోరింట...
తొలి-మలిసంధ్యలకి
సూరీడు అద్దిన అధరాల అరుణాన్ని ధిక్కరిస్తుంది
అరచేతి మధ్యలోని గుండ్రని చందమామ...
వెన్నెల మైదానంలో పరుండిన
పగడాల జాబిలిని తలపిస్తుంది



పండిన గోరింటలు
నీ అరచేతి కాన్వాసులో
చిత్రవిచిత్రమైన చిత్రాలై మురిసిపోతాయి
గోరింట నవ్వులని కెంపులు కాజేస్తాయి...
నవరత్నాలలో మెరుగ్గా కనబడాలని



గోరింట ... నీకు కొత్త కాదులే
నీ బుగ్గల్లో పండుతుంది
సిగ్గులు ఒలికిపుడు
నీ కన్నుల్లో మండుతుంది
నాపై అలిగినపుడు
నీ చేతుల్లో కొలువౌతుంది
నా వేళ్ళు అసంఖ్యాక చిత్రాలు గీసినపుడు
నీ పాదాల్లో ఫక్కుమంటుంది
నా చేయి ఆధారమైనపుడు.
నీ మేనంతా పండుతుంది
నా చూపులు చేసిన గాయాలు...మందారాలై విచ్చుకున్నప్పుడు ...@శ్రీ

||కన్నుల్లో... నీ రూపమే ||




నా కనుపాపల్లో దాగిన నీ సౌందర్యం 
మబ్బుల మాటు వెన్నెలరేని చందం.

రెప్పల చాటున దాగిన నీరూపం 
వెన్నెల్లో సైతం తళుకులీనే తారాదీపం.

కన్నుల్లో నీరూపం చేసే నృత్యాలు
చీకటి యవనికపై సిరివెన్నెల లాస్యాలు.

గుప్పెట్లో దాగని రవికిరణంలా
రెప్పలపై కూడా కనిపించే నీ సమ్మోహన రూపం

నిను నే కోరే వరం
నా కంటిలో నీ శాశ్వత నివాసం...@శ్రీ 

|| రాశుల రాశి ||


 






చలించే ఆలోచనలతో నీవు _ మేషానివే. 

దూకుడుగా రంకేసే యవ్వనంతో నీవు _ వృషభానివే

నీరాశి నారాశి కలిసెడి వలపుల వారాశితో _ మనం మిధునమే

పట్టిన పట్టు విడవని నీవు _ కర్కాటకమే 


సింగపునడుము తో కులికే నీవు _ సింహానివే

మూర్తీభవించిన కన్నెసొగసులతో నీవు _ కన్యవే

అందాలను సమతూకంలో ఉంచిన (నడుముతో) నీవు _ తులవే

అలుకలో విషపు వాక్కులతో గుచ్చే నీవు _ వృశ్చికానివే

ఎక్కుపెట్టిన మదనుని విల్లంటి దేహంతో నీవు _ ధనువే

సర్వశుభంకరివైన నీవు _ మకరివే

తొణకని సౌందర్య కలశాన్ని తలపిస్తూ _ నీవు కుంభానివే

వేటగాళ్ళను వేటాడే జలపుష్ప నేత్రాలతో _ నీవు మీనానివే.

(ఇందులో కొన్ని రాశుల లక్షణాలు ..కొన్ని అందాల పోలికలు ...)....@శ్రీ...

|| పెంచుకో ఆయుర్దాయాన్ని ||






|| వానజల్లు గిల్లుతుంటే ||







మదనుడికి తోడైంది తొలకరి
తపించే తనువులను చినుకుశరాలతో వేటాడుతూ
మనలో సెగలను రగిలించేస్తూ



నీలో చోటు వెతుక్కుంటోంది ప్రతి చినుకు
నే తాకని స్థానంలో ముద్దాడాలని
నీ మేనిపై జారుతూ జలపాతాలను వెక్కిరించాలని.



చినుక్కీ పక్షపాతమే.
ఇద్దరం తడుస్తున్నా
నిన్నే ఎక్కువ తడిమే(పే)స్తోంది నన్నెగతాళి చేసేస్తూ



ఒక్క చినుకుని కూడా దూరనీయద్దు
ఈ తొలకరిలో కలిసి తడిసే మనమధ్య...


ధన్యమౌతోంది...రాలే ప్రతిచినుకు
మన వలపులజల్లులో తడిసాక
మన ప్రేమసాగరంలో మునిగి తేలాక.                      ...@శ్రీ

31/03/2014

జయ ఉగాది







(అందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు )


|| జయ ఉగాది  ||

మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల 
మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే

వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే

ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ
వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే

ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని 
ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే

కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు 
పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే

తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ
విరికన్నెల ప్రసాదాలకై  ప్రదక్షిణలు చేస్తుంటే

చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ 
తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే

శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని
చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ

తరువులన్నిటినీ  పలకరిస్తూ...సుమగంధాలను ఆఘ్రాణిస్తూ
శిశిరాన్ని తరిమి కొడుతూ...విజయదుందుభి మ్రోగిస్తూ

జయకేతనం ఎగురవేస్తూ...విచ్చేసాడు ఋతురాజు
అపజయమెరుగని 'జయ'నామధేయుడు.                    ...@శ్రీ 



(చిత్రకారులు వాసు గారికి ధన్యవాదాలతో ...)

17/03/2014

|| హోలీ ||




మకరందపానం చేస్తూ...
మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి 
సిగ్గులభారాన్ని లెక్కచేయక...
వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం
నిత్యం ఆడుతుంటుంది రంగుల హోలీ

ఉదయకిరణాలను
క్షణానికో రంగులోనికి మార్చేస్తూ
ప్రతివర్ణాన్నీ తూరుపు సంధ్యకు పులిమేస్తూ
అస్తాద్రి చేరుతూ వీడ్కోలు పేరుతో
సంధ్యాసుందరి బుగ్గలకి సిందూర వర్ణాలు పూసేస్తూ
ఆదిత్యుడు నిత్యం ఆడుతుంటాడు రంగుల హోలీ


ప్రతి తరువునీ తపనతో తాకేస్తూ
ప్రతి కొమ్మపై రంగుపూలు చల్లేస్తూ
పుడమి నిండా సందడి చేస్తూ
ఋతురాజు ఆడేది రంగుల హోలీ 


సంధ్యా సమయాలలో
మేఘమాలికలు కురిపించే చిరుజల్లులను
ప్రభాకరుని కిరణాల సాయంతో అల్లరి పెడుతూ
ఆ నీలాలగగనం ఆడేది సప్తవర్ణాల హోలీ.


క్రోధంలో కెంపురంగుని విసురుతూ
నవ్వులతో ముత్యపువర్ణంలో తడుపుతూ
ప్రేమలో సతతహరితాన్నందిస్తూ
నా మదిలో లెక్కలేనన్ని వర్ణాలు నింపుతూ
నీవాడేది రంగురంగుల హోలీ...వేల వసంతాల కేళి. ...@శ్రీ

21/02/2014

|| రాత్రికి స్వాగతం ||





రాత్రంతా చీకటిని చీలికలు చేస్తూనే ఉంటాయి 
కలలను వెదికే కనురెప్పల అంచులకత్తులు

కన్ను మూస్తే కనబడే దుస్వప్నాల కుత్తుకలను 
తెగనరుకుతుంటాయి సుస్స్వప్నాల కాల్పనికఖడ్గాలు

గాయాల చీకట్లు నల్లని రుధిరాన్ని స్రవిస్తూనే ఉంటుంది 
కొత్తవేట్లకి అప్రయత్నంగానే సంసిద్ధమౌతూ

తీయని స్వప్నసాక్షాత్కారం పొందని బాధతో
కళ్ళు కక్కే ఆమ్లాల దాడులకి చెక్కిళ్ళు కాలిపోతూనే ఉంటాయి.

మండుతున్న కలల పొగలు
సుడులు తిరుగుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి కళ్ళని.

నిశను చీల్చినా
రేయిని కాల్చినా
కలలని వ్రేల్చినా
కళ్ళు నిప్పులు చిమ్మినా
విషాదమే గెలుస్తుందని తెలిసినా...
మడమ తిప్పని యోధునిలా
కొత్త ఆశలు నింపుకుంటూ
రెట్టించిన సమరోత్సాహంతో
స్వాగతిస్తున్నాయి నాకన్నులు...మరో రాత్రిని సాదరంగా...

18/02/2014

"శ్రీ కవితలు" రెండవ పుట్టినరోజు






ఆదరిస్తున్న అందరికీ నమస్సుమాంజలి _/\_ 


                                 "శ్రీ కవితలు" రెండవ పుట్టినరోజు                                                              జరుపుకుంటోంది ఈరోజు ...@శ్రీ ...