14/09/2016

|| గుర్తున్నది – తెలుగు గజల్ ||










మొదటిసారి నిన్నెప్పుడు చూసానో గుర్తున్నది
నా మనసుకి నీవు ఎపుడు నచ్చావో గుర్తున్నది

చెవులలోన ఆ పిలుపే వినిపిస్తూ ఉంటుంది
జా(శ్రీ)నూ ! అని నన్నెప్పుడు పిలిచావో గుర్తున్నది

ప్రేమజలధిపై వారధి ఇద్దరినీ కలిపినది
మొట్టమొదటి రాయినెపుడు పేర్చానో గుర్తున్నది

అమృతాన్ని తాగుతుంటె చేదుచేదుగా ఉన్నది 
మొదటిముద్దు రుచినెప్పుడు చూసానో గుర్తున్నది

బాసను మరచిన వేళను మది వెలివేస్తున్నది 
చేతిలోన చేయినెపుడు వేసావో గుర్తున్నది

యవ్వనాల ప్రతినిధిగా నీరూపే కనబడింది 
కోర్కెల కళ్ళేనెపుడు వదిలానో గుర్తున్నది

వె(వ)న్నెలవల(తో)లో నన్నే బంధిస్తే “నెలరాజా”
పున్నమితో నిన్నెప్పుడు పోల్చానో గుర్తున్నది