23/09/2016

|| చేయగలదు(దూ) - తెలుగు గజల్ ||



చందమామే వెలుగుతుంటే చీకటేమిటి చేయగలదు(దూ)
అమావాస్యే కోపగిస్తే వెన్నెలేమిటి చేయగలదు(దూ)

నిన్ను నీవే ఆయుధంగా మలచుకుంటూ సాగిపోవలె
బెదిరిపోయే వైరి పట్టిన శస్త్రమేమిటి చేయగల(దు)దూ

నిదురపోతే ఆలసించక చెంగుచెంగున వాలిపోదా 
రెప్పలార్పని కన్నులుంటే  స్వప్నమేమిటి చేయగల(దు)దూ

పట్టుదలతో అడుగులేస్తే గమ్యమే తల వంచుతుంది 
కాలుకదపని మనుషులుంటే బాట ఏమిటి చేయగల(దు)దూ

మనువు చెప్పిన మాటలన్నీ ఈ యుగానికి పనికిరావు  
కులములన్నీ ఒక్కటైతే శాస్త్రమేమిటి చేయగలదూ

స్వయంశక్తిని నమ్ముకుంటే భాగ్యమంతా నీదికాదా 
బ్రహ్మరాతలతోటి నిండిన ఫాలమేమిటి చేయగల(దు)దూ

కలియుగంలో అసత్యాలే రాజ్యమేలును  "ఓ నెలరాజ"
సాక్షులందరు అమ్ముడైతే  న్యాయమేమిటి చేయగల(దు)దూ